మామిడి పూతపైనే ఆశలన్నీ | - | Sakshi
Sakshi News home page

మామిడి పూతపైనే ఆశలన్నీ

Jan 23 2026 6:41 AM | Updated on Jan 23 2026 6:41 AM

మామిడ

మామిడి పూతపైనే ఆశలన్నీ

పూతలు ఇప్పుడిప్పుడే వస్తున్నాయి

నెలాఖరుకు అన్ని తోటల్లో పూతలు

నూజివీడు నియోజకవర్గంలో 35 వేల ఎకరాల్లో మామిడి విస్తీర్ణం

మామిడి తోటల్లో కనిపిస్తున్న పూతలు

నూజివీడు: నూజివీడు నియోజకవర్గంలో ప్రధాన వాణిజ్య పంటగా విలసిల్లుతున్న మామిడి పంట రైతుల్లో ఆశలు రేకెత్తిస్తోంది. ఈ ఏడాది మామిడి పూతలు నియోజకవర్గ వ్యాప్తంగా బాగానే ఉండటంతో రైతులు ఎంతో ఆశతో ముందుకు సాగుతున్నారు. ఒక ఏడాది కాస్తే మరొక ఏడాది కాయకపోవడం మామిడి ప్రధాన లక్షణం. గతేడాది మామిడి కాపు తక్కువగా ఉన్న నేపథ్యంలో ఈ ఏడాది కాపు ఎక్కువగా ఉండవచ్చనేది కూడా వస్తున్న పూతలను బట్టి రైతులు భావిస్తున్నారు.

దాదాపు 85 శాతం తోటల్లో పూతలు

నూజివీడు, ఆగిరిపల్లి, చాట్రాయి, ముసునూరు మండలాల్లో పండ్ల తోటల్లో మామిడి ప్రధాన పంటగా విలసిల్లుతోంది. ఈ సీజన్‌లో డిసెంబరు ద్వితీయార్థం నుంచి తోటల్లో పూతలు రావడం ప్రారంభమై ప్రస్తుతం దాదాపు 85 శాతం తోటల్లో పూతలు వచ్చాయి. మిగిలిన తోటల్లో కూడా మరో వారం, పది రోజుల్లో పూతలు వచ్చే అవకాశం ఉందని ఉద్యానశాఖ అధికారులు చెబుతున్నారు. కొన్ని తోటలు తెల్లపూత దశలో ఉండగా, మరికొన్ని తోటలు పచ్చిపూత దశలో ఉన్నాయి. బంగినపల్లి, తోతాపురి, రసాలు తదితర అన్ని రకాల్లో పూతలు కనిపిస్తున్నాయి. నూజివీడు బంగినపల్లి కాయలకు, రసాలు, చెరుకు రసాలకు దేశవ్యాప్తంగానే కాకుండా విదేశాల్లో కూడా మంచి పేరుంది. రైతులు పూతల కోసం డిసెంబరు నెల ప్రారంభం నుంచే రసాయన మందులను పిచికారీ చేయడం ప్రారంభించి ప్రస్తుతం పూతలు నిలిచేందుకు పలు చర్యలు తీసుకుంటున్నారు. గత రెండేళ్లుగా మామిడి తోటలపై ఆదాయం ఏమీ రాకపోవడంతో రైతులు ఈ ఏడాదైనా కలిసి వస్తుందనే ఆశాభావంతో ఉన్నారు.

వాతావరణమే కీలకం

మామిడి డిసెంబరు నెలలో పూతలు ప్రారంభమై ఫిబ్రవరి తొలి వారంలో పిందెలు రావడం జరుగుతుంది. మామిడి పూత రావడానికి పగటి పూట అత్యధిక ఉష్ణోగ్రతలు, రాత్రి పూట అధిక చలి వాతావరణం ఉండాలి. గత 20 రోజులుగా వాతావరణం అనుకూలంగా ఉండటంతో పూతలు వస్తున్నాయి. సంక్రాంతి సమయంలో నాలుగు రోజుల పాటు పెద్ద ఎత్తున ఏర్పడిన పొంగమంచుకు తోటల్లో పురుగులు ఆశించి పూత ఏమైనా దెబ్బతింటుందేమోనని రైతులు ఆందోళన చెందారు. అయితే అలాంటి నష్టం ఏమీ జరగకపోవడంతో రైతులు ఊపిరిపీల్చుకున్నారు.

మామిడి తోటల్లో పూతలు ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. పూత నిలవడం కోసం రైతులు రసాయన మందులు పిచికారీ చేసుకుంటున్నారు. బంగినపల్లి, రసాలు, తోతాపురి వంటి రకాల్లో పూతలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. దిగుబడి వచ్చిన తరువాత మార్కెట్‌లో ధర కూడా నిలకడగా ఉంటే మామిడి రైతులకు మేలు జరుగుతుంది.

– పాలడుగు విజయ్‌కుమార్‌, మామిడి రైతు, తుక్కులూరు, నూజివీడు మండలం

ఇప్పటికే 85 శాతం తోటల్లో మామిడి పూతలు వచ్చాయి. ఈ నెలాఖరుకు మిగిలిన తోటల్లో కూడా పూతలు వచ్చేస్తాయి. వాతావరణం అనుకూలంగా ఉండటం మామిడికి మంచి పరిణామం. ఇప్పటి వరకు ఎలాంటి తెగుళ్లు, పురుగులు లేవు. రైతులు ఉద్యాన అధికారులు చెప్పిన విధంగా సలహాలను పాటిస్తే నాణ్యమైన దిగుబడులు వస్తాయి. పిందెలు వచ్చిన యెడల వాటికి కవర్లు కట్టుకుంటే మంచిది.

– ఆర్‌ హేమ, ఉద్యాన అధికారిణి

మామిడి పూతపైనే ఆశలన్నీ 1
1/2

మామిడి పూతపైనే ఆశలన్నీ

మామిడి పూతపైనే ఆశలన్నీ 2
2/2

మామిడి పూతపైనే ఆశలన్నీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement