హెల్మెట్ భారం కాదు.. భద్రత
నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవు
● 37వ జాతీయ భద్రతా మాసోత్సవాలు
● హెల్మెట్ ధారణపై అవగాహన కార్యక్రమాలు
యలమంచిలి: గమ్యస్థానాలకు చేరుకోవాలనే తొందరలో ద్విచక్ర వాహన చోదకులు అతివేగంగా వాహనాలను నడిపి ప్రమాదాల బారిన పడుతున్నారు. దీనికి తోడు హెల్మెట్ ధరించకపోవడంతో ప్రమాదాల్లో మృత్యువాతకు గురై కుటుంబ సభ్యులకు తీరని దుఃఖం మిగుల్చుతున్నారు. నిబంధనలు పాటించాలని ప్రభుత్వ అధికారులు మొత్తుకుంటున్నా వాహనచోదకులు లెక్కపెట్టక ప్రమాదాలు కొని తెచ్చుకుంటున్నారు. 37వ జాతీయ భద్రతా మాసోత్సవాల సందర్భంగా ప్రస్తుతం మోటార్ వెహికల్స్ అధికారులు రోడ్డు భద్రతా నియమాలపై వాహన చోదకులకు అవగాహన కల్పిస్తున్నారు. వాహనచోదకులు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని సూచిస్తున్నారు. అనుకోని ప్రమాదాలు జరిగినా హెల్మెట్ ధరించడం వల్ల ప్రాణాపాయం నుంచి బయట పడవచ్చని చెబుతున్నారు.
హెల్మెట్ ధారణతో లాభాలు
ద్విచక్రవాహనాలు నడిపే వ్యక్తులకు ప్రమాదంలో తలకు దెబ్బ తగిలితే, మెదడు దెబ్బ తినడంతో ఒక్కోసారి దెబ్బ తీవ్రతను బట్టి శరీరంలో కొన్ని అవయవాలు శాశ్వతంగా చచ్చుబడడం, జ్ఞాపకశక్తిని కోల్పోవడం, మంచానికే పరిమితం కావడం, పలు సందర్భాల్లో మరణించడం జరుగుతుంది. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని ప్రతి ఒక్కరూ సూచిస్తున్నారు. హెల్మెట్ ధరించడం వల్ల ప్రమాదాలు జరిగినప్పుడు తలకు అయ్యే గాయాల తీవ్రతను తగ్గించడం వల్ల చాలావరకు ప్రాణాపాయం నుంచి బయటపపడే అవకాశం ఉంటుంది. అందుకే ప్రభుత్వం హెల్మెట్ ఆవశ్యకతను తెలియజేస్తూ వాహన చోదకులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్న నిబంధనలను కఠినతరం చేసింది.
హెల్మెట్ వాడకంపై వాహనచోదకులకు అవగాహన కల్పిస్తున్న అధికారులు
హెల్మెట్ లేకుండా వాహనాలు నడుపుతున్న దృశ్యం
వాహన చోదకులు నిబంధనలను అతిక్రమిస్తే చర్యలు తప్పవు. మద్యం సేవించి, మితిమీరిన వేగం, నిర్లక్ష్య డ్రైవింగ్ కారణంగా ఈ మధ్య కాలంలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. హెల్మెట్ ధరించడంతో పాటు నిబంధనలు పాటించాలి. హెల్మెట్ లేకుంటే మొదటిసారిగా అపరాధం రుసుము విధిస్తాం. రెండోసారి, మూడోసారి పట్టుబడితే వాహనం సీజ్ చేసి కేసు నమోదు చేస్తాం.
– అజ్మీర బద్దు, పాలకొల్లు మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్
హెల్మెట్ భారం కాదు.. భద్రత
హెల్మెట్ భారం కాదు.. భద్రత


