కిచెన్ గార్డెన్‌లతో ఆరోగ్యం
కేంద్ర ప్రభుత్వం పోషణ అభియాన్ పథకంలో భాగంగా ప్రతి అంగన్‌వాడీ కేంద్రంలో పిల్లలు, బాలింతలు, గర్భిణులకు నాణ్యమైన ఆహారం అందించడమే లక్ష్యంగా ఆకు కూరలు, కూరగాయలను పండిస్తున్నాం. అలాగే ఆహ్లాదం కోసం అందమైన పూలమొక్కలను పెంచేలా కృషి చేస్తున్నాం.
– యూవీ పద్మావతి, సీడీపీఓ, బుట్టాయగూడెం ఐసీడీఎస్ ప్రాజెక్టు
బుట్టాయగూడెం: ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజన గ్రామాల్లో ఉన్న అంగన్‌వాడీ కేంద్రాల్లో చుట్టూ పచ్చదనం, అందమైన పూలమొక్కలతో ఆహ్లాదకరంగా దర్శనమిస్తున్నాయి. అలాగే వీటితోపాటు కూరగాయలు, ఆరోగ్యాన్నిచ్చే ఆకుకూరలు వంటివి కూడా అంగన్‌వాడీ కేంద్రం చుట్టూ అంగన్‌వాడీ కార్యకర్తలు పెంచుతున్నారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో పిల్లలకు, గర్భవతులు, బాలింతలకు కలుషితంలేని ఆహారం అందించాలనే ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రతి అంగన్‌వాడీ కేంద్రంలో కూడా న్యూట్రీషన్ గార్డెన్‌లను ఏర్పాటు చేస్తున్నారు. అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చే పిల్లలకు, గర్భవతులు, బాలింతలకు సేంద్రియ ఎరువుల ద్వారా పెంచుతున్న తోటకూర, గోంగూర, మెంతికూర, బచ్చలికూర, పాలకూరతోపాటు వంగ, బెండ, చిక్కుడు, తదితర కూరగాయలను ఆహారంగా అందిస్తున్నారు. అలాగే రకరకాల పూలమొక్కలను కూడా పెంచి కార్యకర్తలు వాటిని రక్షిస్తున్నారు. వీటి పెంపకానికి ఎటువంటి రసాయనిక ఎరువులు వినియోగించకుండా కేవలం సేంద్రియ ఎరువులను మాత్రమే వినియోగించడం విశేషం.
63 న్యూట్రిషన్ గార్డెన్‌లు
బుట్టాయగూడెం ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో న్యూట్రిషన్ గార్డెన్‌లను కార్యకర్తలు పెంచుతున్నారు. బుట్టాయగూడెం, జీలుగుమిల్లి, వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లో కూడా పోషణ అభియాన్ పథకంలో నూట్రిషన్ గార్డెన్‌లను ఏర్పాటు చేస్తున్నారు. కాగా ఒక్క బుట్టాయగూడెం మండలంలోనే సుమారు 63 అంగన్‌వాడీ కేంద్రాల్లో ఏర్పాటు చేసిన న్యూట్రిషన్ గార్డెన్‌లు కళకళలాడుతూ దర్శనమిస్తున్నాయి.
అంగన్‌వాడీ కేంద్రాల్లో కూరగాయలు, ఆకుకూరలు, మొక్కల పెంపకం
కిచెన్ గార్డెన్‌లతో ఆరోగ్యం
కిచెన్ గార్డెన్‌లతో ఆరోగ్యం


