ప్రకృతి సాగుపై కేంద్ర బృందం అధ్యయనం | - | Sakshi
Sakshi News home page

ప్రకృతి సాగుపై కేంద్ర బృందం అధ్యయనం

Jan 23 2026 6:41 AM | Updated on Jan 23 2026 6:41 AM

ప్రకృతి సాగుపై కేంద్ర బృందం అధ్యయనం

ప్రకృతి సాగుపై కేంద్ర బృందం అధ్యయనం

ద్వారకాతిరుమల: రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయం అమలు విధానాలపై కేంద్ర బృందం ప్రత్యేక అధ్యయనాన్ని చేపట్టింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం (గోల్‌) వ్యవసాయ ప్రణాళిక విభాగం, వ్యవసాయం, రైతు సంక్షేమ శాఖకు చెందిన పది మందితో కూడిన కేంద్ర కమిటీ ప్రతినిధుల బృందం గురువారం ద్వారకాతిరుమల మండలం సూర్యచంద్రరావుపేట, గుండుగొలనుకుంట గ్రామాల్లో పర్యటించింది. తొలుత ఈ బృందం సూర్యచంద్రరావుపేట లోని రైతు సరిపల్లి భాస్కర్‌ రాజు పొలాన్ని సందర్శించారు. గత ఏడేళ్లుగా ఆయన 11 ఎకరాల్లో ద్రవ జీవామృతం, సహజ వృద్ధి ప్రోత్సాహకాలతో సాగు చేస్తున్న కోకో, కొబ్బరి ఉద్యాన పంటలను సందర్శించి, ప్రకృతి వ్యవసాయ పద్ధతులను ప్రత్యక్షంగా పరిశీలించారు. అనంతరం గుండుగొలనుకుంటలోని ఒ.గోపాలకృష్ణ నిర్వహిస్తున్న బయో రిసోర్స్‌ సెంటర్‌ (బీఆర్‌సీ)ను సందర్శించి, అక్కడ తయారవుతున్న వివిధ రకాల కషాయాలు, ద్రావణాలు, వాటి వినియోగం, అలాగే గత 8 ఏళ్లుగా అమలు చేస్తున్న ప్రకృతి వ్యవసాయ విధానాలను పరిశీలించారు. అనంతరం ప్రకృతి వ్యవసాయంలోని 9 సూత్రాలపై లైవ్‌ డెమో మోడల్‌ గురించి తెలుసుకున్నారు. అదనంగా ఏటీఎం(ఎనీ టైమ్‌ మనీ) మోడల్‌ ద్వారా 28 కి పైగా రకాల పండ్లు, కూరగాయల సాగు విధానాన్ని పరిశీలించి, కషాయాలు–ద్రావణాల తయారీతో పాటు, విత్తన పెల్లైటెజేషన్‌పై ప్రత్యక్ష ప్రదర్శనను వీక్షించారు. ఈ సందర్భంగా క్షేత్రస్థాయిలో ప్రకృతి వ్యవసాయాన్ని సమర్థవంతంగా అమలు చేస్తున్న రైతు సాధికార సంస్థ (రైస్‌) పనితీరును కేంద్ర బృందం అభినందిస్తూ, రైతులు చేస్తున్న కృషిని ప్రశంసించింది. ఈ పర్యటనలో ప్రకృతి వ్యవసాయ జిల్లా ప్రాజెక్ట్‌ మేనేజర్‌ బి.వెంకటేష్‌, సీనియర్‌ కన్సల్టెంట్‌ కె.వరప్రసాద్‌, జిల్లా వ్యవసాయ అధికారి ఎస్‌కే హబీబ్‌ బాషా, డీహెచ్‌ఓ సజా నాయక్‌, మండల ఉద్యానశాఖ అధికారి అమర్నాథ్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement