ఎమ్మెల్యే పితాని వైఖరి మార్చుకోవాలి
పెనుగొండ: రాజ్యాంగ బద్ధంగా ప్రజల చేత ప్రత్యక్షంగా ఎన్నుకోబడిన స్థానిక సంస్థల ఎస్సీ, బీసీ ప్రజాప్రతినిధుల హక్కులకు, విధులకు ఆటంకం కల్పించే విధంగా ఆచంట నియోజకవర్గంలో వ్యవహరిస్తున్నారని, ఇప్పటికై నా స్థానిక ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ వైఖరిని మార్చుకోవాలని వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు చిన్నం ఏడుకొండలు, నియోజకవర్గ అధ్యక్షుడు పిల్లి రుద్ర ప్రసాద్ డిమాండ్ చేశారు. బుధవారం ఆచంటలో ఎస్సీ సెల్, బీసీ సెల్‌ల ఆధ్వర్యంలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహ వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆచంట పంచాయతీలో దళిత మహిళా సర్పంచ్ కోట సరోజనీ వెంకటేశ్వరరావు హక్కులను కాలరాసి గ్రామ కార్యదర్శి అధికార నాయకుల కనుసన్నల్లో వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఆచంట గ్రామ కార్యదర్శిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా కొడమంచిలి పంచాయతీకి సంబంధించి రికార్డులను తారుమారు చేసి, ఓచర్లను చింపివేసి సర్పంచ్‌ను విచారణ పేరుతో ఇబ్బందులకు గురిచేస్తున్నారని వివరించారు. అలాగే పండితవిల్లూరు సర్పంచ్ బీసీ మహిళ చెక్ పవర్ రద్దు చేయించారని, జగన్నాధపురం బీసీ సర్పంచ్ బిల్లులు నిలుపుదల చేశారన్నారు. పెనుగొండ మండల పరిషత్‌లో బీసీ ఎంపీపీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారన్నారు. కోరం ఉన్నా సమావేశం నిర్వహించకుండా గుండెపోటు నాటకం ఆడడమే కాకుండా, ఎమ్మెల్యే పితానిని కలిస్తేనే ముందుకు సాగడం జరుగుతుందని స్వయనా ఎంపీడీవో హెచ్చరించడం దారుణమన్నారు. ఇటువంటి దురాగతాలను ఆపకపోతే నియోజకవర్గ స్థాయిలో ప్రజాప్రతినిధులతో కలసి ఆమరణ నిరాహార దీక్ష చేపడతామని హెచ్చరించారు. అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఎమ్మెల్యే చేయాల్సిన ప్రభుత్వ కార్యక్రమాలను ఎమ్మెల్యే కుమారుడు చేయడం ఎంతవరకూ సమంజవసమని ప్రశ్నించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు కేతా తాతారావు, జక్కంశెట్టి శ్రీరాములు, కాండ్రేకుల కనకేశ్వరరావు దొమ్మేటి రాంబాబు, గుబ్బల రామకృష్ణ, కొవ్వూరి సురేష్, దొంగ ఉపేంద్ర, చదలవాడ ముత్యాలరావు, పీతల అంబేడ్కర్, పీతల జ్ఞానరాజు, కోటగిరిధర్, మండేల శ్రీను, యడ్ల రామకృష్ణ, కుసుమే వెంకటేశ్వరరావు, ఏనుగుపల్లి వరప్రసాద్, బ్యూలా ప్రసాద్, కోటే శశిమధు, బొరుసు రాంబాబు, యల్లమెల్లి రాజేష్, కొండేటి భవానీ ప్రసాద్, నక్కా శ్రీనులు పాల్గొన్నారు.
ఆచంటలో ప్రజాప్రతినిధుల నిరసన


