తమ్మిలేరు నుంచి రబీకి నీటి విడుదల
రబీకి నీరు విడుదల చేశాం
చింతలపూడి: మధ్యతరహా ప్రాజెక్టు అయిన తమ్మిలేరు నుంచి నియోజకవర్గంలోని ప్రాజెక్టు కింద రబీ పంటకు 9,169 ఎకరాలకు సాగు నీరు విడుదల చేయాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు ఈనెల 16న జరిగిన జిల్లా నీటిపారుదల సలహా మండలి సమావేశంలో అధికారులు తీర్మానించారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 345.81 అడుగుల నీటి నిల్వలు ఉన్నాయి. జలాశయం పూర్తి సామర్థ్యం 355 అడుగులు. ఈ ఏడాది కురిసిన అధిక వర్షాలకు జలాశయంలో పూర్తి స్థాయిలో నీరు చేరింది. ప్రాజెక్టు కింద 9,169 ఎకరాలు అధికారికంగా సాగు చేస్తున్నారు. ఆయకట్టు రైతులు వరికి బదులు ఆరు తడి పంటలు వేసుకుంటే ఇచ్చే నీరు సరిపోతుందని ఇరిగేషన్ అధికారులు రైతులకు సూచిస్తున్నారు.
పూర్తిస్థాయిలో నిండిన ప్రాజెక్టు
ఈ ఏడాది కురిసిన వర్షాలకు జలాశయంలోకి పూర్తి స్థాయిలో నీరు చేరింది. రాష్ట్ర విభజనతో గత 8 సంవత్సరాలుగా జలాశయానికి ఎగువ ప్రాంతం నుంచి వచ్చే నీటిపై రెండు జిల్లాల రైతులు ఆశలు వదులుకున్నారు. గత ఏడాది, ఈ ఏడాది కూడా ఊహించని విధంగా అధిక వర్షపాతం నమోదు అవ్వడంతో రైతులు ఊపిరి పీల్చుకున్నారు. తమ్మిలేరు ప్రాజెక్టు నిర్మించి 40 ఏళ్లు దాటి పోయింది. రిజర్వాయరు ఎగువ భాగంలో 20 వేల ఎకరాలు, దిగువ భాగంలో ఏలూరు వెళ్లే కాల్వకు ఇరుపక్కలా 15 ఏటి కాలువల ద్వారా 14,200 ఎకరాలు సాగవుతున్నాయి. జిల్లాలోని తలార్లపల్లి, యర్రంపల్లి, యడవల్లి, కళ్యాణంపాడు, తువ్వచెలక రాయుడుపాలెం, గ్రామాలకు చెందిన 475 ఎకరాల పల్లం భూములకు, 3,769 ఎకరాల మెరక భూములకు నీటి సరఫరా జరుగుతుంది. అదే విధంగా జిల్లాల పునర్విభజనతో ఏలూరు జిల్లాలో చేరిన పోలవరం, చాట్రాయి, తుమ్మగూడెం, మంకొల్లు, సోమవరం గ్రామాల్లో 1,855 ఎకరాల పల్లం భూములకు, 3,070 ఎకరాల మెరక భూములకు సాగునీరు లభిస్తుంది.
ప్రాజెక్టులో ఉన్న నీటి సామర్థ్యాన్ని దష్టిలో పెట్టుకుని రైతుల అభ్యర్థన మేరకు జిల్లా కలెక్టర్, ఇరిగేషన్ ఎస్‌ఈల ఆదేశాల మేరకు జిల్లా ఇరిగేషన్ అడ్వయిజరీ బోర్డు మీటింగ్‌లో రబీలో సాగు నీరు విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం రబీకి ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వల నుంచి నీరు విడుదల చేశాం. – లాజరుబాబు, ఏఈ, తమ్మిలేరు ప్రాజెక్టు
ఇరిగేషన్ అడ్వయిజరీ బోర్డు మీటింగ్‌లో అఽధికారుల నిర్ణయం
9,169 ఎకరాలకు రబీ సాగు నీరు
ఈ ఏడాది భారీ వర్షాలతో పూర్తిగా నిండిన ప్రాజెక్టు
తమ్మిలేరు నుంచి రబీకి నీటి విడుదల


