అటవీ భూమి ఆక్రమణకు సన్నాహాలు
నూజివీడు: నూజివీడు మండలంలో ప్రభుత్వ భూముల ఆక్రమణ అడ్డూ అదుపూ లేకుండా ఉంది. ప్రభుత్వ భూముల ఆక్రమణ అడ్డుకోవాల్సిన అధికారుల నిర్లక్ష్యంపై ప్రజలు తీవ్ర విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని జంగంగూడెంలో గత 40 ఏళ్లుగా ఎస్సీలు తమ గ్రామ అవసరాలకు ఉపయోగించుకుంటున్న అటవీ భూమిని అధికార పార్టీ నాయకుల అండతో గత ఆరు రోజులుగా కొందరు ఆక్రమించేందుకు అందులోని కంప, తుప్పలను జేసీబీ, ట్రాక్టర్‌తో తొలగిస్తున్నారు. ఆక్రమణలపై గ్రామస్తులు రెవెన్యూ, ఫారెస్ట్ అధికారులకు తెలియజేసినా పట్టించుకోకపోవడంతో ఎస్సీలందరూ ఆదివారం ఆక్రమణలు జరుగుతున్న భూమి వద్దకు వెళ్లారు. ఆక్రమణదారులకు, అడ్డుకోవడానికి వెళ్లిన వారికి వాగ్వివాదం చోటుచేసుకుని ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపధ్యంలో అటవీశాఖ సిబ్బంది అక్కడకు వచ్చి ఇరువర్గాలను పంపించి వేశారు. దీనిపై ఎఫ్‌ఆర్‌ఓ సత్యనారాయణ మాట్లాడుతూ ఆక్రమించుకోవడానికి సన్నాహాలు చేస్తున్న భూమి అటవీ భూమేనని, గత నలభై ఏళ్లుగా గ్రామానికి చెందిన ఎస్సీల అవసరాల కోసం ఉపయోగించుకుంటున్నారన్నారు. ఆక్రమణకు పాల్పడుతున్న వారిపై పోలీస్ కేసు పెట్టనున్నట్లు తెలిపారు.


