నేత్రపర్వం.. గ్రామోత్సవం
ద్వారకాతిరుమల : ఉభయ దేవేరులు, గోదాదేవితో శ్రీవారు తొళక్క వాహనంపై క్షేత్ర పురవీధుల్లో ఆదివారం ఊరేగారు. ధనుర్మాస ఉత్సవాలను పురస్కరించుకుని స్వామివారికి నిర్వహించిన ఈ ఉత్సవం భక్తులకు నేత్రపర్వమైంది. ముందుగా ఆలయంలో శ్రీవారు, అమ్మవార్లు, గోదాదేవి ఉత్సవమూర్తులను తొళక్క వాహనంపై ఉంచి అర్చకులు విశేష పూజలు జరిపారు. ఆ తరువాత మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, అర్చకులు, పండితుల వేద మంత్రోచ్ఛరణలు, గజ, అశ్వ సేవల నడుమ స్వామివారి గ్రామోత్సవం క్షేత్ర పురవీధుల్లో అట్టహాసంగా సాగింది. అనంతరం ఆలయ ప్రధాన కూడలిలోని ధనుర్మాస మండపంలో స్వామి, అమ్మవార్లకు అర్చకులు విశేష పూజలు నిర్వహించి, భక్తులకు తీర్ధప్రసాదాలు పంపిణీ చేశారు.
నూజివీడు: ట్రిపుల్ ఐటీలో లిటరరీ క్లబ్ ఆధ్వర్యంలో భక్తి వేదాంత సహకారంతో ఆదివారం ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్‌పై సెమినార్ నిర్వహించారు. ఐఐటీ గౌహతీ డైరెక్టర్ ఆచార్య ఉప్పులూరి రామ్‌గోపాల్, తిరుపతి ఐఐటీకి చెందిన జయనారాయణ పాల్గొని పలు అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఏఐ వినియోగం, ఉపయోగం వంటి అంశాలపై చర్చించారు. లిటరరీ క్లబ్ ద్వారా విద్యార్థులకు వ్యాసరచన పోటీలను నిర్వహించారు. వ్యాసరచన పోటీల్లో ప్రథమ బహుమతి పొందిన అఖిలేశ్వరికి రూ.5 వేలు, రెండో బహుమతి పొందిన షేక్ హాసియాకు రూ.3 వేలు, మూడో బహుమతి పొందిన హర్షవర్ధన్‌కు రూ.2 వేలను ఐఐటీ డైరెక్టర్ రామ్‌గోపాల్ చేతుల మీదుగా అందజేశారు. కార్యక్రమంలో నూజివీడు ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ ఆచార్య సండ్ర అమరేంద్రకుమార్, అసోసియేట్ డీన్ అకడమిక్స్ దుర్గాబాబు తదితరులు పాల్గొన్నారు.
ఏలూరు (టూటౌన్): చిన్నారులు పోలియో వ్యాధి బారిన పడకుండా వాక్సిన్ వేయించాల్సిన బాధ్యత ప్ర టట తల్లితండ్రులపై ఉందని కలెక్టర్ కె.వెట్రిసెల్వి చెప్పారు. పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా జేవియర్ నగర్‌లోని ఫిరంగులదిబ్బలో ఆదివారం పల్స్ పోలియో కేంద్రంలో చిన్నారులకు పోలియో వ్యాక్సిన్ వేశారు. కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ ఈనెల 21 నుంచి 23 వరకు జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహిస్తారని, 5 సంవత్సరాల లోపు వయసు కలిగిన ప్రతి చిన్నారికి వ్యాక్సిన్ వేస్తారన్నారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌ఓ డా.అమృతం తదితరులు పాల్గొన్నారు.
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): జిల్లా కేంద్రం ఏలూరులో జరుగుతున్న ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)కు ఆదివారం 10 మంది అభ్యర్థులు హాజరయ్యారు. నగరంలోని సిద్ధార్థ క్వెస్ట్ కేంద్రంలో మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ జరిగిన పరీక్షకు 11 మందికి 10 మంది హాజరుకాగా ఒకరు గైర్హాజరయ్యారు. ఈ పరీక్షలను ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు పర్యవేక్షించారు.
ఏలూరు (టూటౌన్): కొత్తగా తీసుకొచ్చిన జీ రాం జీ బిల్లు వల్ల పేదలకు ఎలాంటి ఉపయోగం లేదని, గ్రామీణ ఉపాధి హమీ చట్టాన్ని కొనసాగించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బి.బలరాం డిమాండ్ చేశారు. పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పిల్లి రామకృష్ణ అధ్యక్షతన ఆదివారం ఏలూరులో జరిగిన పార్టీ జిల్లా సెక్రటేరియట్ సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో పని గ్యారంటీ ఉండేదని, ఇప్పుడు కేంద్రం దయాదాక్షిణ్యాలపై ఉండేలా చేశారని తెలిపారు. పథకంలో నిధులు గతంలో కేంద్రానికి 90 శాతం రాష్ట్రానికి 10 శాతం వాటా ఉండేదని, ప్రస్తుతం 60, 40గా మార్చారని తెలిపారు. ఆకలిచావులు, వలసలు నివారించేందుకు ఉపయోగపడిన ఈ చట్టాన్ని రద్దు చేయడం వల్ల మరలా ఆకలిచావులు పెరిగే ప్రమాదం ఉందని పేర్కొన్నారు.
నేత్రపర్వం.. గ్రామోత్సవం


