వ్యాన్ బోల్తా.. ఇద్దరు మృతి
కలిదిండి (కై కలూరు): పొట్టకూటి కోసం చేపల పట్టుబడికి వెళ్లి తిరిగి వస్తుండగా జరిగిన ప్రమాదంలో ఇద్దరు కూలీలు మృతి చెందగా నలుగురు గాయపడ్డారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం కలిదిండి మండలం సున్నంపూడి గ్రామం నుంచి ఇదే మండలం కోరుకొల్లు సమీప చైతన్యపురంలో చేపల పట్టుబడి నిమిత్తం 6 గురు కూలీలు ఆదివారం ఉదయం వెళ్లారు. మధ్యాహ్నం పట్టుబడి అయిన తర్వాత తిరిగి వస్తుండగా మద్వానిగూడెం వద్ద ఎదురుగా వాహనాన్ని తప్పించే క్రమంలో వ్యాన్ బోల్తా పడింది. ఇందులో క్యాబిన్‌లో ముగ్గురు, టాప్‌పై ముగ్గురు ఉన్నారు. వీరిలో పైన కూర్చున్న సున్నంపూడికి చెందిన తిరుమలశెట్టి ఆంజనేయులు (50) అక్కడికక్కడే మృతి చెందాడు. వలసకూలీగా వచ్చిన భీమవరం మండలం కొత్తపూసలమర్రుకు చెందిన కొత్త వెంకటేశ్వరరావు (53) కలిదిండి ఆస్పత్రికి చికిత్స చేయించడానికి తీసుకొస్తుండగా మరణించాడు. అదే విధంగా మృతుడు ఆంజనేయులు కుమారుడు వెంకటకృష్ణకు సైతం తీవ్ర గాయాలయ్యాయి. ఇతన్ని ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మిగిలిన వారికి స్పల్పగాయాలయ్యాయి. కలిదిండి ఎస్సై వి.వెంకటేశ్వరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కై కలూరు తరలించారు. తండ్రి మరణం, కుమారుడికి తీవ్ర గాయాలతో సున్నంపూడిలో విషాదచాయలు అలుముకున్నాయి.
డీఎన్నార్ పరామర్శ
ప్రమాద ఘటన తెలుసుకుని వైఎస్సార్‌సీపీ ఏలూరు జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు(డీఎన్నార్) హుటాహుటీన కలిదిండి పీహెచ్‌సీకి వెళ్ళారు. మృతల కుటుంబ సభ్యులను పరామర్శించారు. మరణించిన కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.
వ్యాన్ బోల్తా.. ఇద్దరు మృతి
వ్యాన్ బోల్తా.. ఇద్దరు మృతి


