బాధితులకు భరోసాగా ప్రాజెక్ట్ రీస్టోర్
● రికవరీ చేసిన చోరీ సొత్తు బాధితులకు అప్పగింత
● ఏలూరు జిల్లాలో రూ.2.93 కోట్ల ఆస్తి అందజేత
ఏలూరు టౌన్: ప్రజలకు సంబంధించిన నగదు, బంగారం, వెండి ఆభరణాలు, వస్తువులు, సెల్‌ఫోన్లు, మోటార్‌సైకిళ్లు చోరీలకు గురైతే పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేస్తుంటారు. ఆయా కేసులను దర్యాప్తు చేసిన పోలీసులు నేరగాళ్ల నుంచి చోరీ సొత్తును స్వాధీనం చేసుకుంటారు. కానీ వాటిని తిరిగి బాధితులకు అందించేందుకు న్యాయస్థానంలో మరో ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. చివరిదశలోని ఆ అంతరానికి ఏలూరు జిల్లా ఎస్పీ శివకిషోర్ చెక్‌పెట్టారు. బాధితులు పోలీస్‌స్టేషన్లు, కోర్టులకు తిరగాల్సిన ఇబ్బందులను తగ్గిస్తూ ప్రాజెక్ట్ రీస్టోర్‌కు రూపకల్పన చేశారు. నేరస్తుల నుంచి రికవరీ చేసిన చోరీ సొత్తును మంగళవారం జిల్లాలోని పోలీసులు బాధితులకు అప్పగించారు.
729 మంది బాధితులకు అప్పగింత
ఏలూరు జిల్లాలో ఏకంగా 729 మంది బాధితులకు రూ.2 కోట్ల 93 లక్షల 60 వేల విలువైన ఆస్తిని పోలీసులు బాధితులకు ఇళ్లకు వెళ్లి అప్పగించారు. వీటిలో 1,020 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.కోటి 32 లక్షల నగదు, 30 మోటారు సైకిళ్లు, 2 నాలుగు చక్రాల వాహనాలు, 647 మొబైల్ ఫోన్లు ఉన్నాయి. వీటిని బాధితులకు అప్పగించడంతో వారు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. టి.నరసాపురం మండలంలోని మధ్యాహ్నపువారిగూడెం, బొర్రంపాలెం గ్రామాల్లో జరిగిన చోరీలకు సంబంధించి నిందితుల నుంచి రికవరీ చేసిన 2.5 గ్రాముల బంగారం, 400 గ్రాముల వెండి, ఎల్‌ఈడీ టీవిలను రికవరీ చేసి బాధితులకు నేరుగా అప్పగించారు. నిడమర్రు మండలంలోని గుణపర్రులో 48 గ్రాముల బంగారు ఆభరణాలను బాధితుతులకు అందించారు. అలాగే 7 స్మార్ట్‌ఫోన్‌లు పోగొట్టుకున్న తోకలపల్లి, మందలపర్రు, బువ్వనపల్లి, పత్తేపురం గ్రామాల్లోని ఫిర్యాదుదారులకు అప్పగించారు. గణపవరం మండలంలోని ఎస్.కొందేపాడులో 11 కాసుల బంగారు ఆభరణాన్ని అప్పగించగా, ఆ మండలంలో వివిధ కేసుల్లో రికవరీ చేసిన 11 మోటార్‌సైకిళ్లు, 13 సెల్‌ఫోన్‌న్లను బాఽధితులకు వారి ఇళ్లవద్దనే పోలీసులు అందజేశారు. భీమడోలు మండలంలోని పూళ్ల, దుద్దేపూడి గ్రామాల్లోని బాధితులకు 17 కాసుల బంగారం, వెండి ఆభరణాలను అప్పగంచారు. ద్వారకాతిరుమలలో బాధితులకు 7 కాసుల బంగారు ఆభరణాలను, రూ. 2 లక్షల నగదును అప్పగించారు. అదేవిధంగా 28 మొబైల్ ఫోన్లను బాధితులకు అందజేశారు.
పోలీసులపై విశ్వాసం పెంచడమే లక్ష్యంగా...
ప్రజల్లో పోలీస్ వ్యవస్థ పట్ల విశ్వాసం, గౌరవాన్ని పెంచడమే లక్ష్యంగా ప్రాజెక్ట్ రీస్టోర్‌ను చేపట్టినట్లు ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ తెలిపారు. నేరస్తులు చోరీ చేసిన ఆస్తి బాధిత కుటుంబాల జీవనోపాధి, సంక్షేమంలో ఎంతో కీలకమైందిగా ఉంటుందన్నారు. బాధితులు పోలీస్‌స్టేషన్లకు, కోర్టులకు పదేపదే తిరుగుతూ మోసగాళ్ల బారిన పడకుండా, నష్టాన్ని భర్తీ చేస్తూ భరోసా కల్పించటం ప్రథమ లక్ష్యం అని చెప్పారు. బాధితులు మానవీయ కోణంలో పోలీసింగ్‌ను రుచిచూస్తే... పోలీస్, న్యాయవ్యవస్థపై ఉన్న భయాన్ని విడిచిపెట్టి ఆయా కేసుల్లో విచారణకు సహకరిస్తాన్నారు. నేరస్తులకు కఠిన శిక్షలు పడే శాతం మెరుగుపడుతుందన్నారు.
బాధితులకు భరోసాగా ప్రాజెక్ట్ రీస్టోర్


