నారసింహునికి పంచామృతాభిషేకాలు
ద్వారకాతిరుమల: శ్రీవారి ఆలయానికి దత్తత దేవాలయమైన ఐఎస్ జగన్నాధపురంలోని సుందరగిరిపై కొలువైన శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి ఆలయంలో మంగళవారం విశేష కార్యక్రమాలు జరిగాయి. నారసింహుని జన్మ నక్షత్రం స్వాతిని పురస్కరించుకుని ముందుగా ఆలయ యాగశాలలో వేద పండితులు విఘ్నేశ్వర పూజ, పుణ్యహవాచనం, మండపారాధనను నిర్వహించారు. అనంతరం వేద మంత్రోచ్ఛరణల నడుమ సుదర్శన నారసింహ, ధన్వంతరీ, గరుడ, ఆంజనేయ, అనంత సుబ్రహ్మణ్య మూలమంత్ర హోమాలను జరిపారు. ఆ తరువాత గర్భాలయంలో కొలువైన స్వామివారి మూలవిరాట్‌కు పంచామృతాభిషేకాలు నిర్వహించి, నక్షత్ర హారతులిచ్చారు. అనంతరం జరిగిన అన్నసమారాధనలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని స్వామివారి అన్నప్రసాదాన్ని స్వీకరించారు.
ద్వారకాతిరుమల: గుంటూరు జిల్లా పెదనందిపాడులో గత శనివారం జరిగిన 45వ మాస్టర్ అథ్లెటిక్స్ రాష్ట్రస్థాయి పోటీల్లో తిరుమలంపాలెం జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల సైన్స్ ఉపాధ్యాయురాలు పైడి రాజేశ్వరమ్మ సత్తా చాటారు. 60 ప్లస్ ఏజ్ గ్రూప్‌లో జరిగిన 100 మీటర్ల పరుగు పందెంలో రాజేశ్వరమ్మ ప్రథమ బహుమతి, 800 మీటర్ల పరుగు పందెంలో ద్వితీయ బహుమతి, 3 కిలో మీటర్ల నడక పోటీలో ప్రథమ బహుమతిని సాధించి, జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా మంగళవారం పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శేషు కుమారి, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయేతర సిబ్బంది రాజేశ్వరమ్మను అభినందించారు.
బుట్టాయగూడెం: ఇటీవల అంకన్నగూడెం గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న బాలిక గర్భవతి అయ్యిందనే నెపంతో బాధ్యులు కాని ప్రధానోపాధ్యాయిని, డిప్యూటీ వార్డెన్‌లను సస్పెండ్ చేయడం సరైన చర్య కాదని, వెంటనే వారి సస్పెన్షన్‌ను రద్దు చేసి విధుల్లోకి తీసుకోవాలని ఏటీఏ రాష్ట్ర అధ్యక్షుడు జలగం రాంబాబు మంగళవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. వేసవి సెలవుల్లో పాఠశాల బయట జరిగిన ఘటనకు బాధ్యులను చేస్తూ ప్రస్తుతం ఇక్కడ పనిచేస్తున్న వారిని సస్పెండ్ చేయడం సబబు కాదన్నారు.
నారసింహునికి పంచామృతాభిషేకాలు


