రోడ్డు ప్రమాదంలో వీఆర్‌ఏ మృతి
జంగారెడ్డిగూడెం: రోడ్డు ప్రమాదంలో వీఆర్‌ఏ మృతి చెందిన ఘటన జంగారెడ్డిగూడెంలో మంగళవారం చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు, బంధువులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బుట్టాయగూడెం మండలం అంతర్వేదిగూడెం గ్రామానికి చెందిన పట్టెల మంగ (50) బుట్టాయగూడెం రెవెన్యూ కార్యాలయంలో వీఆర్‌ఏగా పనిచేస్తోంది. మంగళవారం బుట్టాయగూడెంలో పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు నిర్వహించిన జనవాణి కార్యక్రమంలో పాల్గొంది. అంతర్వేదిగూడెం సచివాలయ గుమస్తా, మృతురాలికి మరిది అయిన తగరం వెంకట్రావు కూడా జనవాణిలో పాల్గొన్నాడు. కార్యక్రమం అనంతరం పంచాయతీ మోటార్‌కు సంబంధించి సామాగ్రి కొనేందుకు వెంకట్రావు మోటార్‌సైకిల్ జంగారెడ్డిగూడెం వస్తుండగా, మంగ కూడా వచ్చింది. పని ముగించుకుని తిరిగి వెళుతుండగా, స్థానిక బుట్టాయగూడెం రోడ్డులోని ఎస్‌బీఐ వద్దకు వచ్చే సరికి వీరి మోటార్‌సైకిల్‌ను వెనుక నుంచి లారీ ఢీకొంది. ఆమైపె లారీ వెళ్లడంతో అక్కడికక్కడే మృతిచెందింది. వెంకట్రావుకు స్వల్ప గాయాలయ్యాయి. కాగా మంగ భర్త మృతిచెందడంతో కారుణ్య నియామకం కింద బుట్టాయగూడెం వీఆర్‌ఏగా ఆమె విధులు నిర్వహిస్తున్నారు. మృతురాలికి డిగ్రీ చదువుతున్న కుమార్తె సౌజన్య ఉంది. తల్లిదండ్రులను కోల్పోడంతో కుమార్తె అనాథగా మిగిలింది. కాగా, ప్రమాద ఘటన తెలుసుకున్న ట్రాఫిక్ ఎస్సై కుటుంబరావు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని ఏరియా ఆసుపత్రికి తరలించి, ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ద్వారకాతిరుమల: మండలంలోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన బైక్‌ల చోరీలపై స్థానిక పోలీస్టేషన్‌లో మంగళవారం కేసులు నమోదయ్యాయి. లక్ష్మీనగర్ జాతీయ రహదారిపై, ఓ పెట్రోల్ బంకులో పనిచేస్తున్న రాజమండ్రికి చెందిన ఏలూరి విజయభాస్కర్ తన బైక్‌ను ఈనెల 15న బంకు వద్ద పార్క్ చేశాడు. 16 న ఉదయం చూస్తే బైక్ కనిపించలేదు. అలాగే ద్వారకానగర్‌కు చెందిన నన్నపనేని వెంకటేశ్వరరావు తన బైక్‌ను ఈనెల 14న రాత్రి గ్రామంలోని రామాలయం వద్ద పార్క్ చేయగా మరుసటి రోజు ఉదయం కనిపించలేదు. బాధితులు స్థానిక పోలీస్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసులు నమోదు చేసిన ఎస్సై టి.సుధీర్ దర్యాప్తు చేపట్టారు.


