దాళ్వాకు నీటి ఎద్దడి ముప్పు | - | Sakshi
Sakshi News home page

దాళ్వాకు నీటి ఎద్దడి ముప్పు

Dec 17 2025 7:01 AM | Updated on Dec 17 2025 7:01 AM

దాళ్వాకు నీటి ఎద్దడి ముప్పు

దాళ్వాకు నీటి ఎద్దడి ముప్పు

సాగునీటి సంఘాల నిర్లక్ష్యంపై ఆరోపణలు

రైతుల ఇక్కట్లు పట్టని ప్రభుత్వం

పెంటపాడు: డెల్టాలో దాళ్వాకు ఆదిలోనే హంసపాదు ఎదురైందా అన్న ప్రశ్న రైతుల్లో వ్యక్తమవుతోంది. నారుమడులకు సైతం నీరు లేక రైతన్నలు అయోమయంలో పడుతున్నారు. పలు గ్రామాల్లో నారుమడులకు సిద్ధమై దుక్కిలు చేపడుతున్నా కొన్ని గ్రామాల్లో నీటి ఎద్దడి వల్ల సరిపడా నీరందక రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఇంకా వంతులవారీ విధానం కూడా చేపట్టలేదు. నారుమడుల సమయంలోనే ఇలా ఉంటే రానురాను ఎలా ఉంటుందోనని రైతులు బెంబేలెత్తుతున్నారు. దీనికి ప్రధాన కారణం కాలువలు పూడిక తీత లేకపోవడమే అని చెబుతున్నారు.

కాలువలు శుభ్రం చేసేదెప్పుడో?

ప్రధానంగా పెంటపాడు మండలంలోని అలంపురం, ప్రత్తిపాడు, రాచర్ల, రావిపాడు, వల్లూరుపల్లి, బోడపాడు, దర్శిపర్రు, జట్లపాలెం, పెంటపాడు, కె. పెంటపాడు, విప్పర్రుతో పాటు, తణుకు ప్రాంతంలోని కోనాల, గూడెం మండలంలోని కృష్ణాయపాలెం, ఉంగుటూరు మండలంలోని బొమ్మిడి, బాదంపూడి ప్రాంతాల మీదుగా ప్రధాన పంట కాలువలైన మిడ్‌లెవిల్‌, లోలెవిల్‌ కాలువలు ప్రవహిస్తున్నాయి. అయితే ఈ రెండు కాలువల ద్వారా వేలాది ఎకరాలు పంట సాగవుతున్నాయి. ఎన్నో గ్రామాలకు తాగునీరు అందుతోంది. ఇదిలా ఉంటే ఆ కాలువల్లో కిలోమీటర్ల మేర గుర్రపుడెక్క, కర్రనాచు, తూడు పేరుకుపోయింది. గత దాళ్వా సమయంలో ఈ సమస్య ఉన్నా వంతుల వారీ విధానం, రైతులు స్వచ్ఛందంగా కాలువలు బాగుచేత కారణంగా నీటి ఎద్దడి లేకుండా ఏదోలా గట్టెక్కారు. అయితే రాబోయే పంట విషయంలో అధికారులు చర్యలు తీసుకోవాల్సి ఉంది. సార్వాలో ఆధునికీకరణ లేక ముంపు సమస్య ఏర్పడింది. పంట నష్టం జరిగింది. కాగా దాళ్వా సమయంలో సాగునీటి విడుదల కావాలంటే కాలువలు శుభ్రంగా ఉండాలి. అడ్డులు, అవాంతరాలు లేకుండా చూడాలి. ఈ పని సాగునీటి యాజమాన్యాలదే. అయితే సాగునీటి సంఘాల సమావేశాలు ఎక్కడా కానరావడంలేదు. ప్రస్తుతం దాళ్వా ప్రారంభంలో సాగునీటి ఇబ్బందులు లేకుండా సాగునీటి యాజమాన్యాలు చూడాల్సి ఉంది. పంట కాలువలు డ్రెయినేజీలు పూడిక తీత తీయాల్సి ఉంది. తూడు, గుర్రపుడెక్క తీయించాలి. ఈ విషయంపై సాగునీటి సంఘాల యజమానులు సమావేశాలు నిర్వహించుకొని ఉపాది, డ్రెయినేజీ, ఇరిగేషన్‌ శాఖల అధికారుల సమన్వయంతో పూడిక తీత తీయించుకొంటే రాబోయే ముప్పునుంచి గట్టేక్కే అవకాశం ఉంది. ఈ విషయంపై చర్యలు తీసుకోవాలని రైతులు, ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

తాగునీటికి ఇబ్బందే

ఇటీవల కాలువలు కాలుష్య కాసారాలుగా తయారవుతున్నారు. సమీప గ్రామాల్లో చెత్తను కాలువల్లో వేస్తున్నారు. జంతు కళేబారాలు ఈ కాలువల్లో కొట్టుకువస్తున్నాయి. కాలువల సమీప గ్రామాల్లో డ్రెయినేజీలు, సెప్టిక్‌ ట్యాంకుల మురుగు నేరుగా ఈ కాలువలో కలుపుతున్నారు. ప్రధానంగా మిడ్‌లెవిల్‌ సమీప గ్రామాలైన అలంపురం, రాచర్ల, వల్లూరుపల్లి, దర్శిపర్రు, లో లెవిల్‌ కాలువ సమీప గ్రామాలైన కె.పెంటపాడు గ్రామాల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంది. ఈ వేసవిలో డ్రెయినేజీ, ఇరిగేషన్‌ శాఖల అధికారులు దీనిపై ఏమేరకు తనఖీలు చేపడతారో చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement