విద్య, వైద్యం ప్రైవేటీకరణకు కుట్రలు
ఏలూరు(టూటౌన్): మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయడం ఎంతో సాహసోపేత నిర్ణయమని దీనివల్ల పేదలకు వైద్యవిద్య అందుబాటులోకి వచ్చేదని హైకోర్టు న్యాయవాది జడ శ్రావణ్ కుమార్ అన్నారు. రాష్ట్రంలోని 17 మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో ప్రైవేటుపరం చేయడాన్ని నిరసిస్తూ ఏలూరులోని లేడీస్ క్లబ్‌లో శనివారం రాత్రి నిర్వహించిన మేధోమధన సదస్సుకు ఆయన ముఖ్య అతిథి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని 17 మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయడాన్ని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేస్తున్నానని దీనిలో ఇప్పటివరకు 7 లక్షల సంతకాలు సేకరించినట్టు చెప్పారు. వైఎస్సార్‌సీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణకు వీటిని జతచేయమన్నట్లు చెప్పారు.
అమ్మఒడి ఘనత జగన్‌దే
రాష్ట్రంలో అమ్మఒడి పథకం ద్వారా విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలకు వచ్చేలా చేసిన ఘనత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిదేనన్నారు. దేశంలోనే మొదటిసారిగా అమ్మఒడి పథకాన్ని ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి కూడా ఆయనేనని గుర్తుచేశారు. గత ప్రభుత్వ హయాంలో నాడు..నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దిన తీరు అమోఘమన్నారు. పేద పిల్లలకు ఇంగ్లిష్ విద్యను అందించాలనే లక్ష్యంతో వైఎస్ జగన్ పనిచేశారన్నారు. ఎన్నికలకు ముందు ఎన్నో హామీలిచ్చిన పవన్ కల్యాణ్ అధికారంలోకి వచ్చాక వాటిలో ఏ ఒక్కటి నెరవేర్చలేకపోవడం సిగ్గుచేటన్నారు. రాష్ట్రంలో 30 వేల మంది మహిళలు మాయమయ్యారంటూ ఇదే ఏలూరులో బహిరంగ సభలో మాట్లాడిన ఆయన అధికారంలోకి వచ్చాక కనీసం ముగ్గురినైనా తీసుకురాగలిగారా అంటూ ప్రశ్నించారు.
సూట్ లోకిగా..
మంత్రి నారా లోకేష్ విశాఖలో నిర్వహించిన సీఐఐ సదస్సులో సూట్‌తో దర్శనమిచ్చి సూట్ లోకిగా మారారని ఎప్పడు తెల్లచొక్కాతో కనిపించే ఆయన ఈ రోజు సూట్‌లో ఎందుకు కనిపించారని ప్రశ్నించారు. పదే పదే సూట్ జడ అని నన్ను వెక్కిరించే కొందరు నాయకులు ఈరోజు లోకేష్‌ని ఏమంటారని నిలదీశారు. సూట్ వేసుకోవడమనేది హుందాతనానికి నిదర్శనమని, దీనిపై ఇతర రకాల వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. అంబేడ్కర్ యువజన సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి మెండెం సంతోష్‌కుమార్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో బహుజన నేత చింతపల్లి గురుప్రసాద్, జెడ్పీటీసీ నిట్టా లీలానవకాంతం, నూకపెయ్యి సుధీర్‌బాబు, వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు తేరా ఆనంద్, నేతల రమేష్‌బాబు తదితరులు పాల్గొన్నారు.
హైకోర్టు న్యాయవాది జడ శ్రావణ్‌కుమార్


