ఆక్వా రైతులను మోసగిస్తున్న ఫీడ్ కంపెనీలు
పాలకొల్లు సెంట్రల్: నష్టాల్లో ఉన్న ఆక్వా రైతులకు ఫీడ్ కంపెనీలు ధర తగ్గించామని చెబుతున్నా.. వాస్తవానికి మాత్రం అలా జరగడం లేదని ఆక్వా రైతు సంఘం అధ్యక్షుడు గొట్టుముక్కల గాంధీభగవాన్‌రాజు అన్నారు. శనివారం స్థానిక కాస్మో స్పోర్ట్స్ కాంప్లెక్స్ భవనంలో జై భారత్ క్షీరారామ ఆక్వా సంఘం ఆధ్వర్యంలో విలేకర్ల సమావేశం మాట్లాడుతూ ఫీడ్ కంపెనీలపై ఒత్తిడి చేయడంతో కేజీకి రూ.6 వరకూ తగ్గిస్తున్నట్లు ప్రకటించారన్నారు. క్షేత్ర స్థాయిలో మాత్రం తగ్గించిన ధర ఆక్వా రైతులకు ఏ విధంగా ఉపయోగపడలేదన్నారు. ఇన్‌వాయిస్‌లో ధరలు తగ్గించకుండా ఎమ్మార్పీ ధరలు తగ్గిస్తే ఉపయోగం ఏంటని, తాము ఎక్కడ నుంచి తీసుకొచ్చి పెట్టుబడులు పెడతామని డీలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారన్నారు. ఫీడ్ కంపెనీలు మాత్రం ఎమ్మార్పీ ధరలు తగ్గిస్తున్నట్లు ప్రచారం చేస్తున్నారే తప్ప ఆచరణలో మాత్రం చేయడం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. క్షేత్ర స్థాయిలో ఏం జరుగుతుందో పట్టించుకోని ప్రభుత్వం, అప్సడా ఎందుకని ప్రశ్నించారు. ప్రభుత్వం ఇలాగే నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తే ఆక్వా రైతులు రోడ్డెక్కి ఆందోళనలకు దిగే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. నెలాఖరు వరకూ వేచి చూస్తామని చర్యలు తీసుకోకపోతే డిసెంబర్ 2న ఆందోళనకు దిగనున్నట్లు తెలిపారు.


