టీడీపీలో గ్రూపుల గోల
ప్రశ్నిస్తే వేధిస్తున్నారు
సాక్షి ప్రతినిధి, ఏలూరు: పదవులు అమ్ముకుంటున్నారని ఒకరు.. మా కులాలకు ప్రాధాన్యత లేదని తొక్కేస్తున్నారని మరికొందరు.. గ్రూపుల గోల పేరుతో సీనియర్లను పూర్తిగా పక్కనపెట్టి వేధిస్తున్నారని ఇంకొకరు ఇలా పశ్చిమ తెలుగుదేశంలో రోజుకో వివాదం తెరమీదకు వస్తుంది. ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క తరహాలో వివాదాలు, అసమ్మతి సెగలు ఇన్‌చార్జులు, ప్రజా ప్రతినిధులకు చుక్కలు చూపిస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం నర్సాపురంలో ఇన్‌చార్జి తీరుకు నిరసనగా ర్యాలీ, తాజాగా భీమవరంలో ఇన్‌చార్జి తీరుపై సభలో వివాదానికి దిగి తీవ్ర విమర్శలు చేయడం హాట్ టాపిక్‌గా మారింది. భీమవరం, నరసాపురంలోని రెండు గ్రూపుల ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరడంతో రోజుకో వివాదం మొదలైంది.
భీమవరం, నరసాపురం నియోజకవర్గాల్లో జనసేన ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో టీడీపీ ఇన్‌చార్జులు కేడర్‌ను పట్టించుకోకపోవడం, పదువులు అమ్ముకుంటున్నారనే అభియోగాలతో నిత్యం అసమ్మతి కుంపటి రగులుతూనే ఉంది. ఒక వివాదం సద్దుమణిగేలోపు.. మరో వివాదం అన్నట్లుగా నిత్యం విమర్శ, ప్రతివిమర్శలు కొనసాగుతున్నాయి. శుక్రవారం భీమవరంలో జరిగిన నియోజకవర్గ స్థాయి సమావేశంలో పొలిట్‌బ్యూరో సభ్యురాలు, ఇన్‌చార్జి తోట సీతారామలక్ష్మి తీరుపై విమర్శలు చేయడమే కాకుండా నిరసన తెలిపారు. నియోజకవర్గంలో మాజీ ఎంపీ తోట సీతారామలక్ష్మి, మాజీ ఏఎంసీ చైర్మన్ కోళ్ళ నాగేశ్వరరావు మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతూనే ఉంది. ఇన్‌చార్జి సీనియర్లను పక్కనపెట్టి ప్రత్యేకంగా అన్ని మండలాలతో కలిపి ఒక టీంను ఏర్పాటు చేసి పార్టీ పదవులు మొదలుకొని ఒకటి అరా నామినేటెడ్ పదవులు అన్ని తమ గ్రూపుకే దక్కేలా చక్రం తిప్పుతున్నారు. ఈ క్రమంలో కోళ్ళ నాగేశ్వరరావు వర్గం ఇన్‌చార్జి తీరుపై గతంలో ఫిర్యాదులు చేసినప్పటికీ అధిష్టానం స్పందించలేదు. దీంతో కోళ్ళ నాగేశ్వరరావు జనసేన ఎమ్మెల్యే కార్యాలయానికి పరిమితమై క్యాంపు రాజకీయాలు సాగిస్తున్నారు.
నరసాపురంలో నిరసన ర్యాలీ
నర్సాపురం టీడీపీలోనూ వర్గపోరు కొనసాగుతోంది. నియోజకవర్గ ఇన్‌చార్జి పొత్తూరు రామరాజు, రాష్ట్ర మైనార్టీ సలహాదారు షరీఫ్‌లు ఒక గ్రూపుగా, మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు మరో గ్రూపుగా మొదటి నుంచి కొనసాగుతున్నారు. ఈ క్రమంలో గత నెలాఖరులో నరసాపురం మార్కెట్ యార్డు చైర్మన్ ప్రమాణస్వీకారానికి ఇన్‌చార్జి మంత్రి గొట్టిపాటి రవి, జిల్లా అధ్యక్షుడు మంతెన రామరాజులు హాజరయ్యారు. మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు పేరు ఆహ్వానపత్రికలో లేకపోవడం, ప్రొటోకాల్ ప్రకారం పిలవలేదంటూ మాధవనాయుడు వర్గం ప్రమాణస్వీకారం రోజు నిరసన ర్యాలీ నిర్వహించింది. సభా ప్రాంగణం వద్ద కొద్దిసేపు నినాదాలు చేసి ఇన్‌చార్జి మంత్రికి వినతిపత్రం అందచేశారు. నియోజకవర్గ ఇన్‌చార్జిగా పొత్తూరు రామరాజును తొలగించి పార్టీని బతికించాలని డిమాండ్ చేయడం చర్చనీయాంశమైంది.
ఈ పరిణామాల క్రమంలో ఇన్‌చార్జికి వ్యతిరేకంగా శెట్టిబలిజ, గౌడ కులాలకు సంబంధించి వీరవాసరం నేత, అగ్నికుల క్షత్రియ వర్గానికి సంబంధించి మరో నేత వేర్వేరుగా కుల సమావేశాలు నిర్వహించారు. టీడీపీలో సీనియర్లుగా ఉన్న తమకు, తమ కులానికి ప్రాధాన్యంలేదని, ఏదైనా ప్రశ్నిస్తే పరోక్షంగా వేధిస్తున్నారంటూ బహిరంగంగా మాట్లాడారు. ముఖ్యమంత్రిని కలిసి ఫిర్యాదు చేయడానికి ప్రయత్నించి విఫలమై చివరికి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడికి ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ పరిస్థితిలో మార్పు లేదు. దీంతో అసమ్మతి వర్గానికి కోళ్ళ పరోక్షంగా నేతృత్వం వహిహితో శుక్రవారం జరిగిన సమావేశంలో సీనియర్లను పట్టించుకోవడం లేదు.. నామినేటెడ్ పదవులు అమ్ముకుంటున్నారంటూ ఆరోపణలు గుప్పించడంతో గందరగోళం రేగింది.
పదవులు అమ్ముకుంటున్నారంటూ రోడ్డెక్కుతున్న నేతలు
భీమవరంలో తారాస్థాయికి ఆధిపత్య పోరు
ఇన్‌చార్జి సీతారామలక్ష్మిపై ప్రత్యర్థి వర్గం నిరసన గళం
నరసాపురంలోనూ ఇదే వ్యవహారం
మాజీ ఎమ్మెల్యే బండారు వర్సెస్ ఇన్‌చార్జి రామరాజు
ఇన్‌చార్జి తీరుకు వ్యతిరేకంగా ఇటీవల నిరసన ర్యాలీ
టీడీపీలో గ్రూపుల గోల


