మధ్యాహ్న భోజనం నాణ్యతతో ఉండాలి
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం నాణ్యతను ఉపాధ్యాయులు పరిశీలించిన తరవాతే విద్యార్థులకు అందించాలని కలెక్టర్ వెట్రిసెల్వి విద్యాశాఖాధికారులను ఆదేశించారు. స్థానిక అశోక్ నగర్‌లోని కేపీడీటీ హైస్కూల్‌ను శనివారం కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేసి మధ్యాహ్న భోజనం నాణ్యత, విద్యా బోధనల స్థాయిని పరిశీలించారు. విద్యార్థులతో కలిసి కలెక్టర్, డీఈఓ భోజనం చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ మధ్యాహ్న భోజనం నాణ్యత విషయంలో ఏజెన్సీ, ఉపాధ్యాయులు రాజీ పడవద్దన్నారు. విద్యార్థులు, వారి తల్లితండ్రుల సూచనలు, అభిప్రాయాలను పరిగణనలోనికి తీసుకోవాలని, మధ్యాహ్న భోజనం రుచి, శుచి తప్పనిసరిగా ఉండేలా బాధ్యత వహించాలన్నారు. కొంతమంది విద్యార్థులు ఇంటి నుంచి భోజనం తీసుకురావడంపై కలెక్టర్ పిలిచి అందుకు కారణాలను అడిగి తెలుసుకున్నారు. తనిఖీలో భాగంగా విద్యార్థులను కలెక్టర్ కొన్ని ప్రశ్నలు వేశారు. విద్యార్థులు చదివే తరగతికి తగ్గట్టుగా సామర్థ్యాలు కలిగి ఉండాలని, వారికి ఆ విధంగా బోధన అందించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖాధికారి ఎం.వెంకట లక్ష్మమ్మ, ఎంఈఓ వీ అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
వ్యక్తిగత–సమాజ పరిశుభ్రతపై అవగాహన
కలెక్టరేట్ ప్రాంగణంలో స్వర్ణాంధ్ర– స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా వ్యక్తిగత – సమాజ పరిశుభ్రత అంశంపై కలెక్టరేటు ఉద్యోగులు, విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా కలెక్టరు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, దీనివల్ల వ్యాధులకు దూరం కావచ్చన్నారు. పరిసరాల పరిశుభ్రత కార్యక్రమాలలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలని పిలుపునిచ్చారు.


