కొలిక్కిరాని కొల్లేరు హద్దులు
న్యూస్‌రీల్
గండ్లు పెట్టినా.. దర్జాగా సాగు
శనివారం శ్రీ 15 శ్రీ నవంబర్ శ్రీ 2025
సాక్షి, ప్రతినిధి, ఏలూరు: కొల్లేరు కాంటూరు సరిహద్దుల కథ కొత్త మలుపులు తిరుగుతోంది. కొల్లేరు పరీవాహక ప్రజలను ఊరించి, ఊరించి ఉసూరుమనిపిస్తోంది. కొల్లేరు ప్రజల ఆశలను ఆసరాగా చేసుకుని ప్రజాప్రతినిధులు వారి అవసరాలతో ఆటలాడుకుంటున్నారు. కొల్లేరు పరీవాహక గ్రామాల ప్రజలకు శాశ్వత పరిష్కారం చూపిస్తామనే ప్రధాన ఎన్నికల వాగ్దానంతో గద్దెనెక్కిన నాయకులు ఇప్పుడు ముఖం చాటేస్తున్నారు. కొల్లేరు అంశంపై తుది నిర్ణయం సుప్రీంకోర్టుకు మాత్రమే ఉన్నా స్థానిక నాయకులు అంతా తమ చేతుల్లోనే ఉందంటూ బిల్డప్ ఇస్తున్నారు.
2.25 లక్షల ఎకరాల్లో..
పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లో 10వ కాంటూరు వరకు 2.25 లక్షల ఎకరాల్లో కొల్లేరు విస్తరించి ఉంది. ఆక్రమణల కారణంగా అప్పటి చంద్రబాబు పాలనలో 120 జీఓను ప్రవేశపెట్టారు. దీంతో కొల్లేరు అభయారణ్యం 5వ కాంటూరు వరకు 77,135 ఎకరాలుగా నిర్ణయించారు. తర్వాత కూడా ఆక్రమణల పర్వం పెరగడంతో కొల్లేరు ఆపరేషన్ నిర్వహించి ఇరు జిల్లాల్లో 31,120 ఎకరాల్లోని అక్రమ చెరువులను ధ్వంసం చేశారు. వీటిలో 14,932 ఎకరాల జిరాయితీ, 5,510 ఎకరాల డీ–ఫాం భూ ములు ఉన్నాయి. వీటికి పరిహారం ఇవ్వకుండా ధ్వంసం చేశారని ఇటీవల రాష్ట్ర చేపల రైతుల సంఘం సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ వేసింది.
సీఈసీ అధ్యయనం : కొల్లేరు ఆపరేషన్ తర్వాత సుప్రీంకోర్టు జారీ చేసిన ఉత్తర్వులను ప్రభుత్వం అమలు చేయలేదని, దీంతో కొల్లేరు అభయారణ్యంలో ఆక్రమణలు పెరిగాయని కాకినాడకు చెందిన పర్యావరణవేత్త మృత్యుంజయరావు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. దీంతో ఈ ఏడాది జనవరి 16న సుప్రీంకోర్టు జడ్జ్జీలు కొల్లేరులో ఆక్రమణలపై ఘాటుగా స్పందించారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో కేంద్ర సాధికారత కమిటీ (సీఈసీ) సభ్యులు జి.భానుమతి, రమన్‌లాల్ భట్, సునీల్ లిమాయే, చంద్రప్రకాష్ గోయల్ జూన్ 17, 18వ తేదీల్లో కొల్లేరులో పర్యటించారు. అయితే ఇప్పటికీ వారు సుప్రీంకోర్టుకు నివేదిక ఇవ్వలేదు.
అటవీ అధికారి కీలక సమావేశం
సీఈసీ సభ్యులు అడిగిన సమాచారం ఇరు జిల్లాల్లో రెవెన్యూ, ఇరిగేషన్ తదితర శాఖల నుంచి పూర్తిస్థాయిలో రాకపోవడంతో సీఈసీ సీరియస్ అయ్యింది. దీంతో రాష్ట్ర అటవీ శాఖ చీఫ్ ప్రిన్సిపల్ కన్జర్వేటర్ పీవీ చలపతిరావు ఏలూరులో కలెక్టర్, ఇరు జిల్లాల అటవీ, రెవెన్యూ, ఇరిగేషన్, డ్రైనేజీ శాఖల అధికారులతో గురువారం సమీక్షించారు. కొల్లేరు అభయారణ్యం సరిహద్దులను అభయారణ్యం రూపొందించినప్పుడు ఉన్న రికార్డులతో ప్రస్తుతం ఆధునిక లిడార్ సర్వే టెక్నాలజీ ద్వారా గుర్తించి నివేదికలు సమర్పించాలని సూచించారు. నీటిపారుదల శాఖ కొల్లేరు సరస్సు ప్రాంతం వివరణాత్మక కాంటూర్ మ్యాప్‌లతో పాటు, ఉప్పుటేరు సరిహద్దులను గుర్తించి నివేదికలు సమర్పించాలని చెప్పారు.
మలుపులు తిరుగుతున్న కథ
సీఈసీకి సమాచారం ఇవ్వడంలో జాప్యం
జిల్లా అధికారులపై సీఈసీ సీరియస్
అభయారణ్యం హద్దులు గుర్తించాలని ఆదేశం
ఆక్రమిత చెరువులు ధ్వంసం చేశామంటూ ప్రభుత్వం బిల్టప్
కొల్లేరులో నేటికీ ఆగని అక్రమ సాగు
కొల్లేరు గ్రామాల్లో సీఈసీ పర్యటించినా అక్రమ సాగు మాత్రం యథేచ్ఛగా సాగుతూనే ఉంది. అటవీశాఖ ఇరు జిల్లాల్లో 18 వేల ఎకరాల్లో అక్రమ చేపల సాగు కొల్లేరు అభయారణ్యంలో ఉందని నివేదిక ఇచ్చింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో వీటిలో 9,500 ఎకరాల చెరువులకు గండ్లు పెట్టామని తెలిపింది. వాస్తవానికి అటవీ అధికారులు గండ్లు పెట్టిన చెరువుల్లో దర్జాగా అక్రమ సాగు జరుగుతోంది. ఇది ఎక్కడ బయటపడితే సీఈసీ ఆగ్రహానికి గురవుతామో అనే ఆందోళనలో అటవీ అధికారులు ఉన్నారు. ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో సీఈసీ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందోనని ఇటు కొల్లేరు ప్రజలు, అటు అధికారులు ఎదురుచూస్తున్నారు.
కొలిక్కిరాని కొల్లేరు హద్దులు
కొలిక్కిరాని కొల్లేరు హద్దులు


