ప్రదక్షిణ మార్గం నుంచే ఆలయంలోకి వెళ్లాలి
● శ్రీశ్రీశ్రీ త్రిదండి అహోబిల రామానుజ జీయర్ స్వామీజీ
● చిన వెంకన్న ఆలయంలో వివాదాస్పద క్యూలైన్, విగ్రహాల పరిశీలన
ద్వారకాతిరుమల: ఆలయాల్లోకి భక్తులు ప్రదక్షిణ మార్గం గుండానే వెళ్లాలన్న నియమం ఉందని శ్రీశ్రీశ్రీ త్రిదండి అహోబిల రామానుజజీయర్ స్వామీజీ అన్నారు. ద్వారకాతిరుమల చినవెంకన్న ఆలయంలో అప్రదక్షిణ మార్గంలో క్యూలైన్ నిర్మాణం చేపట్టారన్న ఆధ్యాత్మికవేత్త బీకేఎస్‌ఆర్ అయ్యంగార్ ఫిర్యాదుపై స్వామీజీ శుక్రవారం క్షేత్రాన్ని సందర్శించారు. స్వామి, అమ్మవార్ల దర్శనానంతరం ఆయన వివాదాస్పద క్యూలైన్, ఆంజనేయ, గరుత్మంతుని విగ్రహాలను పరిశీలించి ఆలయ ప్రధానార్చకుడు పీవీఎస్‌ఎస్‌ఆర్ జగన్నాథాచార్యులు (రాంబాబు)తో మాట్లాడారు. అనంతరం స్వామీజీ ఆలయ కార్యాలయంలో విలేకర్లతో మాట్లాడారు. భక్తులు ప్రదక్షిణగా వెళితేనే దేవుడితో బంధం ఏర్పడుతుందని, లేదంటే ఆ బంధం నుంచి దూరమవుతామని అన్నారు. ఇక్ష్వాకు వంశానికి చెందిన మహారాజు దిలీపుడికి అప్రదక్షిణ వల్ల సంతానం కలగలేదని, మళ్లీ గోసేవ చేసుకుని, గోవు అనుగ్రహంతోనే సంతానాన్ని పొందారన్నారు. శ్రీ రాముడు సైతం వనవాసానికి వెళ్లే సందర్భంలో కలశాల చుట్టూ ప్రదక్షిణ చేసి వెళ్లారని తెలిపారు. వైష్ణవ సంప్రదాయం ప్రకారం చుట్టూ ఉన్న ఆళ్వార్లను, విఖనస మహర్షిని, అమ్మవార్లను దర్శించిన తరువాతే స్వామి వారిని దర్శించాలనే నియమం ఉందన్నారు. చిన వెంకన్నను ప్రదక్షిణ మార్గం గుండా వెళ్లి దర్శించుకోవడానికి ఇక్కడ అవకాశం ఉందని స్పష్టం చేశారు. ఆలయంలో ఆంజనేయ స్వా మి, గరుత్మంతుడు శ్రీవారి పాదాలకు కాకుండా, భక్తుల పాదాలకు నమస్కరిస్తున్నట్టు ఉందని, ఆ విగ్రహాల ముందున్న క్యూలైన్ గట్టును తొలగించాలని ఈఓ ఎన్‌వీఎస్‌ఎన్ మూర్తికి సూచించారు. చరిత్రలో భాగమైన నృసింహ సాగరాన్ని గ్రామస్తుల సహకారంతో అభివృద్ధి చేయాలని స్వామీజీ సూచించారు.
మహా కుంభాభిషేకం జరపాలి
ఏలూరు చెన్నకేశవస్వామి ఆలయ రాజగోపుర పునర్నిర్మాణం తర్వాత మహాకుంభాభిషేకం జరపలేదని, వెంటనే జరపాలని, శ్రీవారికి కుచ్చులమెట్ట ఉత్సవాన్ని పునరుద్ధరించాలని, స్థానాచార్య పో స్టుకు ఉన్న అడ్డంకులను తొలగించి వెంటనే పోస్టును భర్తీ చేయాలని, ఏలూరులోని ఆర్‌ఆర్‌పేట రాఘవాచర్య వీధిలో అరిటికట్ల సరోజిని శ్రీవారికి విరాళంగా ఇచ్చిన 176 గజాల స్థలంలో రూపక ఆలయాన్ని గాని, గ్రంథాలయాన్ని గాని నిర్మించాలని అయ్యంగార్ ఈఓను కోరారు. అనంతరం విశ్వహిందూపరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు ఒబిలిశెట్టి వెంకటేశ్వర్లు, హిందూ దేవాలయాల పరిరక్షణ సమితి రాష్ట్ర కోశాధికారి పైడేటి రఘు మాట్లాడుతూ అంతరాలయ దర్శనం టికెట్‌ను రూ.500 కంటే తగ్గించాలని, ఏలూరు చెన్నకేశవస్వామి ఆలయంలో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచి, కోనేరును శుభ్రపరచాలని కోరారు. ఏలూరు శ్రీవైష్ణవ సంఘం అధ్యక్షుడు కొంపల్లి కృష్ణమాచార్యులు, సీ్త్ర శక్తి సంఘం అధ్యక్షురాలు కొంపల్లి తాయారు తదితరులు ఉన్నారు.
శ్రీవారి సేవలో.. అహోబిల రామానుజ జీయర్ స్వామీజీ స్వామి, అమ్మవార్లను దర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ముందుగా ఆయనకు ఆలయ అధికారులు మర్యాదపూర్వక స్వాగతం పలికారు. ఈఓ మూర్తి స్వామీజీకి శ్రీవారి చిత్రపటాన్ని అందించారు. ఈ సందర్భంగా స్వామీజీ మాట్లాడుతూ ఇటీవల ఇక్కడ గోమాతలు శరీరాన్ని విడిచిపెట్టాయి కాబట్టి ఆ దోషాన్ని తొలగించమని పెరుమాళ్లను ప్రార్థించినట్టు చెప్పారు.


