వరి రైతు వెన్నులో వణుకు
న్యూస్‌రీల్
ఆదివారం శ్రీ 26 శ్రీ అక్టోబర్ శ్రీ 2025
ఏలూరు(మెట్రో): వర్షాకాలం వెళ్లిపోయిందనుకుని ఊపిరి పీల్చుకుంటున్న రైతన్నను తుపాను హెచ్చరికలు భయపెడుతున్నాయి. గత వారం రోజులుగా వర్షాలతో ఇబ్బంది పడుతుండగా.. తాజాగా తుపాను వరి రైతు వెన్నులో వణుకు పుట్టిస్తోంది. ఏటా రైతన్నలు నష్టాన్ని చవిచూస్తూనే ఉన్నారు. ఈ ఏడాది వర్షాకాలం పూర్తయినప్పటికీ ప్రకృతి కనికరించకుండా విరుచుకుపడుతోంది. గత మూడు రోజులుగా వర్షాలతో రైతన్నలకు కంటిమీద కునుకు లేదు. ఆరుగాలం శ్రమించి పండించిన పంట వర్షాలకు కళ్ల ముందే దెబ్బతింటుంటే రైతన్న దుఃఖం వర్ణణాతీతం. ప్రస్తుతం మొంథో తుపాను విరుచుకుపడుతుందన్న ప్రచారంతో ఆందోళన నెలకొంది. సోమ, మంగళవారాల్లో తుపాను తూర్పు, పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల్లో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్పింది. ఈ నేపథ్యంలో ఏలూరు జిల్లాలో ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. ఈ తుపాను ప్రభావంతో రైతులకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. తుపాను ప్రభావంతో ఆదివారం నుంచి వర్షాలు కురుస్తాయని, సోమ, మంగళవారాల్లో తీవ్రత అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ చెప్పడంతో ఒకవైపు ప్రజలు, మరోవైపు రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
అత్యంత అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్
ఈ నెల 30 వరకు అధికారులు, సిబ్బంది పూర్తి అప్రమత్తతతో ఉండాలని కలెక్టర్ కే.వెట్రిసెల్వి ఆదేశాలు జారీ చేశారు. అదే విధంగా ఏలూరు జిల్లా కేంద్రంలో కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. 94910 41419, 180023 31077 నెంబర్లను ప్రజలకు అందుబాటులో ఉంచారు. 28, 29 తేదీల్లో తీవ్రమైన గాలులు వీస్తాయని, ఈ నేపథ్యంలో హోర్డింగులు, స్తంభాలు, బలహీనంగా ఉన్న చెట్లు, శిధిలావస్థలో ఇళ్ళు, పూరిల్లు కూలిపోయే అవకాశం ఉందని, వీటిపై అప్రమత్తంగా ఉండాలని వీటిని తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లా, డివిజన్, మండల స్థాయిలో 24 గంటలు కంట్రోల్ రూంలు ఏర్పాటు చేసి సిబ్బందిని అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకున్నారు.
పీజీఆర్‌ఎస్ కార్యక్రమం రద్దు
తుపాను కారణంగా సోమవారం నిర్వహించే పీజీఆర్‌ఎస్ కార్యక్రమాన్ని రద్దు చేశారు. జిల్లా ప్రజలు సోమవారం పీజీఆర్‌ఎస్‌కు హాజరుకావద్దని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. రైతన్నల విషయంలో ప్రాధమిక అంచనాలను సిద్ధం చేస్తున్న జిల్లా అధికారులు రైతులకు జాగ్రత్తలు, సూచనలు చేశారు. జిల్లా వ్యాప్తంగా 1,84,060 ఎకరాల్లో వరి పంటను రైతులు సాగు చేస్తున్నారు. వరి పంటను రక్షించుకునే పనిలో రైతులు నిమగ్నమయ్యారు. లక్ష ఎకరాల్లో వరి కోతకు సిద్ధం కాగా మిగిలిన చోట్ల వరి పొట్ట ఈనికదశలో ఉంది. ఈ నేపథ్యంలో పంటను తుపాను ఏం చేస్తుందో అనే ఆందోళనలో రైతులున్నారు. ఏది ఏమైనా రానున్న మూడు రోజుల్లో రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే.
రెండు, మూడు రోజులు కీలకం
తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో అధికారులు అప్రమత్తం
మూడు రోజులుగా జిల్లా వ్యాప్తంగా వర్షాలు
రెండు రోజుల్లో 300 మి.మీ. పైగా వర్షపాతం నమోదు
వరి రైతు వెన్నులో వణుకు


