అడుగడుగునా మడుగులే
● పట్టించుకోని అధికారులు, ప్రజా ప్రతినిధులు ● డ్రెయిన్‌లు తవ్వించినా పరిష్కారం శూన్యం
ఆకివీడు: జాతీయ రహదారి నెం.165 ఆధునికీకరణ దేవుడెరుగు.. ప్రస్తుతం ఉన్న రోడ్డు అడుగడుగునా గుంతలతో భయపెడుతుంది. వాహన చోదకులు, ప్రయాణికులు, పాదచారుల అవస్థలు వర్ణణాతీతం. డ్రైనేజీ సౌకర్యం లేకపోవడంతో వర్షపు నీరు, మురుగు నీరు రోడ్లపై ప్రవహిస్తూ.. తీవ్ర దుర్గంధం వెదజల్లుతోంది. రోడ్డుపై వెళ్లే వారు వ్యాధులకు గురవుతామనే ఆందోళనలో ఉన్నారు. ఇటీవల కచ్చా డ్రెయిన్ తవ్వినప్పటికీ వర్షపు, మురుగు నీరు ప్రవహించడంలో తీవ్ర ఇబ్బంది ఏర్పడింది. ఎన్‌హెచ్ నెం.165 అభివృద్ధికి ఉప్పుటేరు నుంచి దిగమర్రు వరకూ రూ.2200 కోట్లు కేటాయించినా, పనులు మాత్రం అంగుళం ముందుకు కదలడం లేదు. ఏళ్ల తరబడి జాతీయరహదారి అభివృద్ధి అంటూ పాలకులు, ఆ శాఖ అధికారులు ప్రజల్ని ఊరిస్తున్నారు. ఈ రోడ్డును జాతీయ రహదారుల శాఖ విలీనం చేసుకుని రెండు పుష్కర కాలాలు గడిచినా అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉందని వాపోతున్నారు. డ్రైనేజ్ సౌకర్యం కల్పించకుండా, రోడ్డు ఇరువైపులా ఉంటున్న వారినే డ్రైయినేజీ నిర్మించుకోమనడం దారుణమని పలువురు వాపోతున్నారు. జాతీయ రహదారిని అభివృద్ధిచేయాలని, రోడ్డును పునర్నిర్మించాలని కోరుతున్నారు.
వైఎస్సార్ సెంటర్‌లో..
జెడ్పీ హైస్కూల్ సమీపంలో..
అడుగడుగునా మడుగులే
అడుగడుగునా మడుగులే


