చెరువుల పటిష్టతను పరిశీలించాలి
ఏలూరు(మెట్రో): జిల్లాలో 350 మైనర్ ఇరిగేషన్ చెరువుల మరమ్మతులు, పునరుద్ధరణ పనులకు సంబంధించి ప్రతిపాదనలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతులు రాగానే యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని కలెక్టరు ఆదేశించారు. కలెక్టరేట్‌లో మాట్లాడుతూ అధిక వర్షాలను దృష్టిలో పెట్టుకుని జిల్లాలో 1513 చెరువులు పటిష్టతపై క్షేత్రస్థాయిలో పరిశీలించి పూర్తిస్థాయిలో నివేదికను సమర్పించాలని ఆదేశించారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిస్థితిని గమనిస్తూ క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ పరిస్థితిని అధ్యయనం చేసు కోవాలన్నారు. చెరువుగట్ల పరిస్థితిని ఒకటికి నాలుగు సార్లు పరిశీలించి, పటిష్టతకు అన్ని చర్యలు చేపట్టాలన్నారు. అవసరమనుకున్న చోట ఇసుక బస్తాలు తగ్గినన్ని నిల్వలు పెట్టుకోవాలని, ఇలాంటి విషయాల్లో అలసత్వం, నిర్లక్ష్యం వహించకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అధికారులకు కలెక్టరు సూచించారు. సమావేశంలో ఇరిగేషన్ డిప్యూటీ సూపరింటెండెంట్ ధనుంజయ, డీఈలు పి.గనిరాజు, ధర్మజ్యోతి, అర్జునరావు, సహాయక ఇంజనీర్లు పాల్గొన్నారు.
కలిదిండి(కై కలూరు): అధిక వర్షాలతో కై కలూరు – కలిదిండి రహదారిలో కలిదిండి ప్రారంభ లాల్వ డ్రెయిన్‌పై సింగిల్ లైన్ బ్రిడ్జి శుక్రవారం రాత్రి పూర్తిగా కొట్టుకుపోయింది. దీంతో అధికారులు శనివారం తాత్కాలిక కాలిబాట వంతెనను ఏర్పాటు చేశారు. విద్యుత్‌శాఖ నుంచి తీసుకొచ్చిన రెండు పొడవాటి సిమెంటు స్తంభాలను అమర్చారు. నడకదారులు పడిపోకుండా రెండు వైపుల కర్రలను కట్టారు. పరిస్థితి అదుపులోకి వచ్చిన తర్వాత బ్రిడ్జి నిర్మాణం చేస్తామని అధికారులు చెప్పారు.
భీమవరం (ప్రకాశంచౌక్): జిల్లా వైద్య ఆరోగ్యశాఖ పరిధిలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిణి డాక్టర్ జి.గీతాబాయి ఆధ్వర్యంలో మాతృ మరణాలు, శిశు మరణాలు సబ్ కమిటీ అంతర్గత సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ త్రెమాసికంలో శిశు మరణాలు, కారణాలపై సంబంధిత వైద్యాధికారులు, పర్యవేక్షకులు ఏఏన్‌ఏం ఆశా కార్యకర్తలు, అంగన్‌వాడీ కార్యకర్తలతో సమగ్ర విశ్లేషణ నిర్వహించారు. సమావేశంలో జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ దేవ సుధా లక్మీ, జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారి డాక్టర్ సూర్యనారాయణ, గర్భకోశ వ్యాధుల నిపుణులు డా.మాధవి కళ్యాణి, చిన్న పిల్లలు వ్యాధి నిపుణులు డా.ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
భీమవరం: జిల్లా వ్యాప్తంగా శనివారం 507 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా పాలకొల్లులో 69.6 మిల్లీమీటర్లు నమోదుకాగా భీమవరంలో 26, నరసాపురంలో 16.6, తాడేపల్లిగూడెంలో 8, తణుకులో 7.6, ఆకివీడులో 30.2, పెంటపాడులో 14, అత్తిలిలో 22.6, గణపవరంలో 29.6, ఉండిలో 30.4, పాలకోడేరులో 19.2, పెనుమంట్రలో 23.8, ఇరగవరంలో 18.8, పెనుగొండలో 14.4, ఆచంటలో28, పోడూరులో 22.2, వీరవాసరంలో 34.2, కాళ్లలో 22.2, మొగల్తూరులో 22.2, యలమంచిలిలో 49.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
భీమవరం: జిల్లాలో మద్యం అమ్మకాలకు ప్రభుత్వం ఎలాంటి టార్గెట్లు పెట్టలేదని జిల్లా అబ్కారీ శాఖాధికారి కెవీఎన్ ప్రభుకుమార్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. మద్యం వ్యాపారులు అమ్మకాలకు సరిపడా స్టాక్‌ను డిపోల నుంచి కొనుగోలు, అన్ని రకాల స్టాక్ ఉండేలా దిశానిర్దేశం చేస్తున్నట్లు తెలిపారు. ఇతర రాష్ట్రాల మద్యం, కల్తీ మద్యం షాపుల్లో అమ్మకుండా చర్యలు తీసుకున్నామని ఆయన వివరించారు. కల్తీ మద్యం విక్రయాలను అడ్డుకోడానికి ప్రభుత్వం సురక్షయాప్‌ను అందుబాటులోని తీసుకొచ్చినట్లు వివరించారు.
చెరువుల పటిష్టతను పరిశీలించాలి


