మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ దుర్మార్గం
నూజివీడు: వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో తొలి విడతగా 10 మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయడం దుర్మార్గమని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ నూజివీడు నియోజకవర్గ ఇన్‌ఛార్జి మేకా వెంకట ప్రతాప్ అప్పారావు ధ్వజమెత్తారు. పట్టణంలోని వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ కార్యాలయంలో శనివారం ప్రజా ఉద్యమం పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడంపై నిరసనగా ఈ నెల 28న పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహిస్తున్నామన్నారు. ఈ ర్యాలీలో ప్రజలందరూ పాల్గొనాలని ప్రతాప్ పిలుపునిచ్చారు. వైఎస్ జగన్ తన పాలనలో 17 ప్రభుత్వ కళాశాలలను తీసుకొస్తే నేడు కూటమి ప్రభుత్వం వాటిని పీపీపీ పద్ధతిలో ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టడం దుర్మార్గమన్నారు. 17 మెడికల్ కాలేజీల్లో ఐదు కళాశాలల నిర్మాణం పూర్తయ్యి తరగతులు నడుస్తున్నా కూటమి ప్రభుత్వం వాటిని ప్రైవేటు వ్యక్తులకు అప్పగించిందన్నారు. పేద, మధ్యతరగతి వర్గాలకు చెందిన విద్యార్థులు వైద్య విద్యను చదువుకోవడం కూటమి ప్రభుత్వానికి ఏమాత్రం ఇష్టం లేదన్నది దీనినిబట్టి స్పష్టమవుతోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కార్పోరేట్ శక్తులకు దోచిపెట్టడమే పనిగా పెట్టుకుందన్నారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడం వల్ల పేదలకు ఉచిత వైద్యం దూరమవుతుందని విమర్శించారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ కొమ్ము వెంకటేశ్వరరావు, వైఎస్సార్‌సీపీ మున్సిపల్ విభాగం అధ్యక్షుడు మలిశెట్టి బాబీ, కోఆప్షన్ సభ్యులు ప్రసాదరావు, జిల్లా అధికార ప్రతినిధి కంచర్ల లవకుమార్, క్రిస్టియన్ విభాగం జిల్లా అధ్యక్షులు పిళ్లా చరణ్ తదితరులు పాల్గొన్నారు.


