
పడకేసిన వైద్యం
తణుకు ఆస్పత్రికి వెళ్లమన్నారు
అత్తిలి, మంచిలి పీహెచ్‌సీ వైద్యులు సమ్మెలోకి వెళ్లడంతో ఇన్‌చార్జిగా ఉన్న వైద్యులు రెండు రోజులు మాత్రమే ఆస్పత్రులకు వచ్చి సేవలందించారు. తర్వాతి నుంచి వారు రావడం లేదు. సాధారణ వ్యాధులతో వచ్చేవారికి పాత చీటీల ప్రకారం ఇక్కడి వైద్య సిబ్బంది మందులిచ్చి పంపిస్తున్నారు. మిగిలిన కేసుల్ని తణుకు జిల్లా ఆస్పత్రికి రిఫర్ చేస్తుండటంతో రోగులు ఇబ్బంది పడాల్సి వస్తోంది. నెలరోజుల క్రితం వరకు రోజుకు 60కు ఓపీ నమోదయ్యేది. రెగ్యులర్ వైద్యులు సమ్మెలోకి వెళ్లడంతో ప్రస్తుతం 30 నుంచి 40 లోపు ఉంటోంది.
సాక్షి, భీమవరం : డిమాండ్ల సాధన కోసం రూరల్ పీహెచ్‌సీ వైద్యులు సమ్మెలోకి వెళ్లడంతో మూడు వారాలుగా గ్రామీణ వైద్యం పడకేసింది. సీహెచ్‌సీ, ఏరియా ఆస్పత్రుల నుంచి సర్ధుబాటు చేసిన వైద్యులు చాలాచోట్ల చుట్టపు చూపునకే పరిమితమవుతున్నారు. పూర్తిస్థాయిలో వైద్యసేవలందక రోగులు ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. గతంతో పోలిస్తే రోజువారీ ఓపీ తగ్గిపోయింది.
సర్వీస్‌లోని పీహెచ్‌సీ వైద్యులకు పీజీ కోటాలో సీట్లు పునరుద్ధరించాలని, టైం బాండ్ పదోన్నతులు కల్పించాలని, గిరిజన ప్రాంతాల్లో పనిచేసేవారికి బేసిక్‌పై 50 శాతం అలవెన్స్ ఇవ్వాలని, కౌన్సెలింగ్ విషయంలో అర్బన్ అండ్ నేటివిటీపై ఆరేళ్ల గడువుని ఐదు సంవత్సరాల కుదించడం, నేటివిటీ పై స్పష్టత కావాలని, చంద్రన్న సంచార చికిత్స కార్యక్రమానికి రూ.5000 అలవెన్స్ ఇవ్వాలని కోరుతూ ఏపీపీహెచ్‌సీడీఏ (ఏపీ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ డాక్టర్ అసోసియేషన్) ఆందోళనకు పిలుపునిచ్చింది. జిల్లాలో 34 రూరల్ పీహెచ్‌సీల పరిధిలో దాదాపు 68 మంది వైద్యులకు దాదాపు 60 మంది ఈనెల 1వ తేదీ నుంచి విధులు బహిష్కరించి సమ్మె చేస్తున్నారు.
ఇలా వచ్చి అలా వెళ్లిపోతున్నారు
వైద్యసేవలకు అంతరాయం కలుగకుండా జిల్లాలోని తణుకు, భీమవరం, తాడేపల్లిగూడెం, పాలకొల్లు, నరసాపురం, ఆకివీడులలోని ఏరియా ఆస్పత్రులు, కమ్యూనిటీ హెల్ల్ సెంటర్ల నుంచి దాదాపు 27 మంది వైద్యులను డిప్యుటేషన్‌పై పీహెచ్‌సీలకు సర్దుబాటు చేశారు. ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఆస్పత్రిలోనే ప్రజలకు అందుబాటులో ఉండి వైద్యసేవలు అందించాలి. చాలాచోట్ల వైద్యులు రెండు మూడు గంటలు సేవలందించి మధ్యాహ్నం 1 గంట సమయానికి వెళ్లిపోతుండగా, కొన్నిచోట్ల విధులకు గైర్హాజరవుతున్నారు. అక్కడకక్కడ మాత్రమే సాయంత్రం వరకు అందుబాటులో ఉంటున్నారు. బుధవారం పలు పీహెచ్‌సీల్లో ఇటువంటి దృశ్యాలే కనిపించాయి.
సిబ్బందే దిక్కు
వైద్యులు అందుబాటులో లేకపోవడం, ఇన్‌చార్జిలు ఎప్పుడు వస్తారో? ఎప్పుడు వెళ్లిపోతారో తెలీని పరిస్థితుల్లో ఆస్పత్రులకు వచ్చే వైద్య సిబ్బంది వైద్యుల అవతారం ఎత్తుతున్నారు. మధ్యాహ్నం తర్వాత దాదాపు అన్ని పీహెచ్‌సీల్లోనూ ఇదే పరిస్థితి. తమ పరిధిలో సేవలందించి మిగిలిన కేసులను సీహెచ్‌సీ, ఏరియా ఆస్పత్రులకు వెళ్లాల్సిందిగా సూచిస్తుండటంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. దీంతో ఎందుకొచ్చిన గొడవన్నట్టు ముందుగానే రోగులు పట్టణాలకు వెళ్లిపోతున్నారు. రెగ్యులర్ వైద్యులు ఉన్న సమయంతో పోలిస్తే చాలా పీహెచ్‌సీల్లో ప్రస్తుత ఓపీ తగ్గినట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఈ మేరకు రూరల్ పీహెచ్‌సీల్లో ప్రసవాలు సంఖ్య తగ్గింది. వైద్యుల ఆందోళనపై ప్రభుత్వం ఇంకా స్పందించకపోవడంతో సమ్మె ఇంకా ఎన్నిరోజులు కొనసాగుతుందో తెలీని పరిస్థితి. అప్పటి వరకు వైద్యసేవల కోసం ఇబ్బందులు తప్పవని రోగులు వాపోతున్నారు. త్వరితగతిన సమస్య పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపాలని కోరుతున్నారు.
పాలకోడేరులో ఖాళీగా ఉన్న బెడ్లు
మూడు వారాలుగా సమ్మెలో రూరల్ పీహెచ్‌సీ వైద్యులు
మధ్యాహ్నం వరకే ఆస్పత్రుల్లో అందుబాటులో ఇన్‌చార్జులు
ఏఎన్‌ఎంలు, అటెండర్లే దిక్కు
వైద్యం కోసం రోగుల ఇక్కట్లు
వైద్యుల సమ్మెతో పెంటపాడు, ముదునూరు పీహెచ్‌సీల్లో రోజువారి ఓపీ 120 నుంచి దాదాపు సగానికి తగ్గింది. రెండు పీహెచ్‌సీలకు తాడేపల్లిగూడెం ఏరియా ఆస్పత్రి నుంచి ఇద్దరు ఇన్‌చార్జి వైద్యుల్ని నియమించినా వారు సకాలంలో రాకపోవడం, గంట లేదా రెండు గంటలు మాత్రమే వైద్యసేవలు అందించి వెళ్లిపోతుండటంతో వైద్యం కోసం వచ్చిన రోగులకు ఇబ్బందులు తప్పడం లేదు. పెంటపాడు పీహెచ్‌సీలో ఉదయం 11 గంటల వరకు వైద్యుడు రాకపోవడంతో రోగులు పాత చీటిపై మందులు తీసుకుని వెళ్లారు.
పాలకోడేరు ఇన్‌చార్జి డాక్టర్ బుధవారం విధులకు హాజరుకాకపోవడంతో ఆయుష్ డాక్టర్ ఓపీ చూశారు. రెగ్యులర్ వైద్యులు సమ్మెలోకి వెళ్లడంతో ఇన్‌చార్జి వైద్యులు మధ్యాహ్నం వరకు ఆస్పత్రిలో ఉండి వెళ్లిపోతున్నారు. తర్వాత ఆనారోగ్య సమస్యలతో వచ్చేవారు ఇబ్బంది పడాల్సి వస్తోంది. గతంలో రోజుకు 60 నుంచి 70 వరకు ఓపీ ఉంటే వైద్యులు అందుబాటులో లేక ప్రస్తుతం తగ్గుతోంది. బుధవారం 47 ఓపీ నమోదైంది. బెడ్‌లు ఖాళీగానే ఉంటున్నాయి.
గుండెల్లో మంటగా ఉండడంతో అత్తిలి పీహెచ్‌సీకి వైద్యం నిమిత్తం వచ్చాను. వైద్యులు అందుబాటులో లేరని తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాల్సిందిగా సిబ్బంది సూచించారు. స్థానికంగా వైద్యులు అందుబాటులో లేక ఇబ్బందులు పడాల్సి వస్తోంది.
– కోట జగపతిబాబు, అత్తిలి

పడకేసిన వైద్యం

పడకేసిన వైద్యం

పడకేసిన వైద్యం

పడకేసిన వైద్యం