
అధినేతతో ఆత్మీయ కలయిక
కొయ్యలగూడెం: వైఎస్సార్‌సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డిని బుధవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో కలుసుకున్నట్లు మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు బుధవారం తెలిపారు. నియోజకవర్గ ఇన్‌చార్జి బాధ్యతలను అప్పగించినందుకు కృతజ్ఞతలు తెలిపానన్నారు. ఈ సందర్భంగా కొయ్యలగూడెం టౌన్ నాయకుడు నూకల రాము ఆధ్వర్యంలో మహానేత వైఎస్సార్ చిత్రపటాన్ని బహుకరించినట్లు పేర్కొన్నారు. కోటి సంతకాల సేకరణ కార్యక్రమం అమలుపై అధినేతకు వివరించినట్లు తెలిపారు. సర్పంచ్ పసుపులేటి రాంబాబు, పార్టీ నాయకులు గంటా రమేష్, మందపాటి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 24న కొయ్యలగూడెంలోని ప్రకాశం డిగ్రీ కళాశాలలో జాబ్‌మేళా నిర్వహించనున్నట్టు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఎన్.జితేంద్ర బాబు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ జాబ్ మేళాలో సుమారు 13 కంపెనీల ప్రతినిధులు పాల్గొంటారని, సుమారు 985 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించవచ్చన్నారు. పదో తరగతి, ఇంటర్, ఐటీఐ, డిప్లమో, డిగ్రీ, (డీ/బీ/ఎం) ఫార్మసీ, ఎంబీఏ, పీజీ, బీ.టెక్ వంటి విద్యార్హతలు ఉండి 18–35 సంవత్సరాల వయస్సు గల వారు అర్హులన్నారు. ఇతర వివరాలకు 9666322032, 9652503799 నెంబర్లతో పాటు టోల్ ఫ్రీ 9988853335 నెంబర్‌లో కూడా సంప్రదించవచ్చన్నారు.
టి.నరసాపురం: నిబంధనలకు విరుద్ధంగా ఇసుక రవాణా చేస్తున్న లారీని మక్కినవారిగూడెం, కొల్లివారిగూడెం గ్రామస్తులు అడ్డుకున్నారు. కొవ్వూరు నుంచి తిరువూరుకు ఇసుక లారీ మక్కినవారిగూడెం మీదుగా వెళుతోంది. అధిక లోడుతో వెళ్లడంతో గ్రామస్తులు అడ్డుకున్నారు. అధిక లోడుతో వెళ్తుండడంతో రోడ్లు పాడవుతున్నాయని గ్రామస్తులు తెలిపారు. లారీని టి.నరసాపురం పోలీస్‌స్టేషన్‌కు తరలించి, ఎస్సైకు అప్పగించారు. దీంతో రికార్డులు సక్రమంగా ఉన్నాయో లేదో తేల్చాలంటూ తహసీల్దార్ సాయిబాబాకు లేఖ రాశారు.
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఈ ఖరీఫ్ సీజన్‌లో జిల్లాలో 4.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు ముందస్తు ప్రణాళికలను సిద్ధం చేయాలని కలెక్టర్ వెట్రిసెల్వి సంబంధిత అధికారులను ఆదేశించారు. స్థానిక డీసీఎంఎస్ ఫంక్షన్ హాల్లో బుధవారం జిల్లా పౌరసరఫరాల శాఖా ఆధ్యర్యంలో ఖరీఫ్ 2025– 26 ధాన్యం కొనుగోలుపై సంబంధిత సిబ్బందికి అవగాహన సదస్సు, సాంకేతిక శిక్షణ కార్యక్రమం కలెక్టరు, జాయింటు కలెక్టరు ఎంజే అభిషేక్ గౌడ అధ్యక్షతన జరిగింది. పవర్ పాయింటు ప్రజెంటేషన్ ద్వారా 2025– 26 ఖరీఫ్‌కు సంబంధించిన ధాన్యం కొనుగోలు ప్రక్రియ, టెక్నికల్ అంశాలను సిబ్బందికి వివరించారు.
ఏలూరు(మెట్రో): పోలవరం ప్రాజెక్ట్ నిర్వాసితుల పునరావాసానికి ఏలూరు జిల్లాలో 2799.60 ఎకరాల భూమిని గుర్తించామని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి రాష్ట్ర జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయి ప్రసాద్‌కు తెలిపారు. రాష్ట్ర సచివాలయం నుంచి బుధవారం పోలవరం ప్రాజెక్ట్ నిర్వాసితుల పునరావాస కార్యక్రమాల ప్రగతిపై సంబంధిత జిల్లా కలెక్టర్లతో సాయి ప్రసాద్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పునరావాస ప్యాకేజిలో భాగంగా అవసరమైన భూమికి భూమి, పునరావాస కాలనీల నిర్మాణానికి మొత్తం 7812.05 ఎకరాల భూమి అవసరం కాగా, ఇంతవరకు 2799.60 ఎకరాల భూమిని గుర్తించామని, 1734.63 ఎకరాల భూమికి భూసేకరణ దశలో ఉందన్నారు.

అధినేతతో ఆత్మీయ కలయిక