
ఎదురీదుతున్న వనామీ
పట్టించుకోని ప్రభుత్వం
భీమవరం అర్బన్: ఉమ్మడి జిల్లాలో వనామీ రొయ్య పెంపకం సిరులు కురిపించడంతో రొయ్య రైతులు మొగ్గు చూపుతున్నప్పటికీ వర్షాకాలంలో సోకే వైట్ స్పాట్, విబ్రియో, వైట్‌గట్ లాంటి వ్యాధులు రైతులను నష్టాల బాట పట్టిస్తున్నాయి. దీంతో పట్టుబడికి వచ్చిన రొయ్యలు లేకపోవడంతో రొయ్య ధరలకు రెక్కలొస్తున్నాయి. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో సుమారు 1.10 లక్షల ఎకరాల్లో రొయ్యలు సాగు చేస్తున్నారు. భీమవరం మండలంలో సుమారు 12 వేల ఎకరాలలో వనామీ పెంచుతున్నారు. ఈ ఏడాది మొత్తం రొయ్యల పెంపకంలో ప్రతికూల వాతావరణంతో వైరస్ సోకి తీవ్రంగా నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అమెరికా పన్ను పోటు వనామీ రొయ్యలపై పడటంతో కేజీకి రూ.40 నుంచి రూ.60 తగ్గించేయడం, మరోపక్క వైరస్‌ల దాడితో నష్టాల బాట పడుతున్నామని రైతులు చెబుతున్నారు.
వర్షాకాలంలో వనామీ విలవిల
ఈ ఏడాది వర్షాకాలంలో రెండు మూడు రోజులు వర్షాలు పడటం, మరో నాలుగు రోజులు ఎండలు తీవ్రంగా ఉండి ఉక్కబోతగా ఉండటంతో తరచూ వాతావరణ మార్పుల కారణంగా వనామీ రొయ్యలకు వైట్‌స్పాట్, విబ్రియో, ఈహెచ్‌పీ వంటి వైరస్‌లు సోకి రొయ్య పిల్ల దశలోనే మృత్యువాత పడుతోంది. మండలంలో 20 నుంచి 40 శాతం లోపు సీడ్ దశ నుంచి కౌంట్ వరకు రొయ్యలున్నాయి. వైరస్ దాడి చేయడంతో రైతులు గట్ల చుట్టూ బ్లీచింగ్ కొడుతూ పక్షులు వాలకుండా జాగ్రత్తలు తీసుకుని నిరంతర ఏరియేటర్లు తిప్పుతూ ఎప్పటికప్పుడు పరీక్షలు చేయిస్తూ రొయ్యలను కాపాడుకుంటున్నారు.
ప్రస్తుతం వనామీ ధరలు
ప్రస్తుత వనామీ ధరలు 100 కౌంట్ రూ.200, 90 కౌంట్ రూ.205, 80 కౌంట్ రూ.215, 70 కౌంట్ రూ.245, 60 కౌంట్ రూ.280, 50 కౌంట్ రూ.290, 45 కౌంట్ రూ.300, 40 కౌంట్ రూ.320, 30 కౌంట్ రూ.345 వరకూ ఉన్నాయి.
రొయ్య ధరలపై ప్రభుత్వం పర్యవేక్షణ ఉంటే రైతుకు లబ్ధి చేకూరుతుంది. మార్చి నుంచి జూన్ వరకు వ్యాపారస్తులు కుమ్మకై ్క రొయ్యలు కొనుగోలు చేయడం లేదని చెప్పడంతో వారు చెప్పిన ధరకు అమ్ముకుని నష్టపోతున్నాం. రొయ్య ధరలను స్థిరీకరించి ఎప్పుడూ ఒకే ధర ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటేనే రైతుకు లబ్ధి చేకూరుతుంది.
–పెనుమాల నరసింహస్వామి, గొల్లవానితిప్ప
రొయ్యల చెరువులకు సంబంధించి ఫీడ్, సీడ్, మెడిసిన్, కూలీల ధరలు పెరిగినప్పటికీ రొయ్యల ధరలు మాత్రం పెరగడం లేదని రైతు లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆక్వా చెరువులకు సబ్సిడీలు రాకపోవడంతో పెట్టుబడులు పెరిగి పెంపకం భారంగా మారిందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అమెరికా దిగుమతిపై 50 శాతం సుంకాలు పెంచడంతో ఆక్వా ట్రేడర్స్ కేజీకి 40 నుంచి 60 వరకు తగ్గించేశారు. దీంతో సాగులో పెట్టుబడులు కూడా రావడం లేదని రైతులు గగ్గోలు పెడుతున్నారు. రైతులు రొయ్యల సాగు చేపట్టకుండా ప్రత్నామ్నాయ మార్గాలైన పండుగొప్ప, శీలావతి, చేపల చెరువు సాగు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు.
వాతావరణ మార్పులతో వైరస్ ముప్పు

ఎదురీదుతున్న వనామీ