
ఫిర్యాదులు సకాలంలో పరిష్కరించాలి
ఏలూరు(మెట్రో): ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ ద్వారా ప్రజల నుంచి అందిన దరఖాస్తులకు నాణ్యమైన పరిష్కారంతో పాటు ప్రజల సంతృప్తి స్థాయిని అడిగి తెలుసుకుంటున్నామని కలెక్టర్ కె.వెట్రిసెల్వి భూపరిపాలన శాఖ చీఫ్ కమిషనర్ జి.జయలక్ష్మికి తెలిపారు. సచివాలయం నుంచి బుధవారం పీజీఆర్‌ఎస్ దరఖాస్తుల పరిష్కారం, పేదలకు ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ, సుమోటో క్యాస్ట్ వెరిఫికేషన్, జిల్లాల విభజన తదితర అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా సీసీఎల్‌ఏ జయలక్ష్మి మాట్లాడుతూ దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి నిర్దేశించిన సమయంలోగా నాణ్యమైన పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. పరిష్కారం అనంతరం ప్రజల సంతృప్తి స్థాయిని తెలుసుకోవాలన్నారు. ఇళ్ల పట్టాలకోసం దరఖాస్తు చేసుకున్నవారిలో అర్హులను గుర్తించి ఇళ్ల స్థలాలు అందించాలన్నారు. కలెక్టర్ జిల్లాలో ప్రగతిని తెలిపారు. పీజీఆర్‌ఎస్‌లో 13,562 దరఖాస్తులు అందగా వాటిలో 91.1 శాతం మేర పరిష్కరించామన్నారు.