
కార్తీకం.. శివోహం
పంచారామం.. మోక్షధామం
కార్తీకం.. పవిత్ర మాసం
● 23 నుంచి కార్తీక మాసోత్సవాలు
● జిల్లావ్యాప్తంగా ఆధ్యాత్మిక శోభ
● పంచారామాల్లో ప్రత్యేక ఏర్పాట్లు
● వేలాది మంది భక్తుల రాక
భీమవరం(ప్రకాశం చౌక్): పరమ పవిత్రమైన కార్తీక మాసోత్సవాలకు జిల్లాలోని శైవక్షేత్రాలు ముస్తాబవుతున్నాయి. ఈనెల 23 నుంచి కార్తీకమాసం ప్రారంభం కానున్న నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా ఆధ్యాత్మిక శోభ సంతరించుకోనుంది. జిల్లాలో దేవదాయశాఖ నిర్వహణలో 30కు పైగా ప్రసిద్ధి శివాలయాలు ఉన్నాయి. ఆలయ కమిటీల ద్వారా నిర్వహించే శివాలయాలు మరో 15 వరకు ఉంటాయి. ముఖ్యంగా జిల్లాలో భీమవరం, పాలకొల్లులో పంచారామ క్షేత్రాలకు ఏటా కార్తీక మాసంలో వేలాది మంది భక్తులు వస్తుంటారు.
ప్రత్యేక పూజలు.. విశేష అలంకరణలు
నెల రోజులపాటు పంచారామ క్షేత్రాల్లో స్వామివార్లకు ప్రత్యేక పూజలు, విశేష అలంకరణలు చేస్తుంటారు. అలాగే ప్రత్యేక అభిషేకాలు, కార్తీక దీపారాధనలు జరుగుతుంటాయి. రాత్రిళ్లు విద్యుత్ కాంతులతో క్షేత్రాలు దేదీప్యమానంగా వెలుగొందుతాయి.
శక్తీశ్వరస్వామి ప్రత్యేకం
ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా భీమవరం మండలం యనమదుర్రులో పార్వతీ సమేత శక్తీశ్వర స్వామి ఆలయంలో స్వామివారు తలకిందులుగా దర్శనమిస్తారు. పార్వతీమాత బాలింతగా, కుమారస్వామి వారి ఒడితో పెట్టుకుని ఒకే పీఠంపై దర్శనమిస్తారు. ఈ ఆలయానికీ వేలాదిగా భక్తులు తరలివస్తారు. భీమవరం నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఈ క్షేత్రం ఉంది.
మరిన్ని ప్రసిద్ధి ఆలయాలు
జిల్లాలోని పలు ప్రాంతాల్లో మరిన్ని ప్రసిద్ధి శివాలయాలు ఉన్నాయి. భీమవరంలో భీమేశ్వరస్వామి వారు, ఆచంటలో ఆచంటేశ్వరస్వామి, నత్తారామేశ్వరంలో రామేశ్వరస్వామివారు, జుత్తిగలో ఉమా సోమేశ్వరస్వామివారు, లక్ష్మణేశ్వరంలో దుర్గా లక్ష్మణేశ్వరస్వామి, వీరవాసరంలో వీరేశ్వరస్వామి, కొడమంచిలిలో సర్వేశ్వరస్వామి, శివ దేవుని చిక్కాలలో శివదేవస్వామి, సజ్జాపురంలో సోమేశ్వరస్వామి, పెనుగొండలో నగరేశ్వరస్వామి, ఎన్పార్పీ అగ్రహారంలో విశ్వేశ్వరస్వామి, ఉండిలో మల్లేశ్వరస్వామి, ఆకివీడులో భీమేశ్వరస్వామి, మల్లేశ్వరస్వామి, వేండ్ర అగ్రహారంలో రామలింగేశ్వరస్వామి, అండలూరులో మల్లేశ్వరస్వామి, నవుడూరులో రామలింగేశ్వరస్వామి, విస్సాకోడేరులో సోమేశ్వరస్వామి, తాడేరులో రామలింగేశ్వరస్వామి, తుందుర్రులో సోమేశ్వరస్వామి ఇలా పలు శివాలయాలు కార్తీక మాసోత్సవాలకు ముస్తాబవుతున్నాయి.
భీమవరంలో ఉమాసోమేశ్వరస్వామి
పాలకొల్లులో క్షీరారామలింగేశ్వరస్వామి
జిల్లాలో రెండు పంచారామ క్షేత్రాలు ఉన్నాయి. భీమవరం గునుపూడిలోని ఉమాసోమేశ్వర జనార్దన స్వామి వారి దేవస్థానం (సోమారామం), పాలకొల్లులో క్షీరా రామలింగేశ్వరస్వామి దేవస్థానం (క్షీరారామం)గా కీర్తిగడించాయి. భీమవరం పంచారామక్షేత్రంలో ఉమాసోమేశ్వరుడు చంద్రుడి ప్రతిష్ఠాపన కావడంతో శివలింగం అమావాస్యకు గోధుమ వర్ణంలో, పౌర్ణమి నాడు శ్వేతవర్ణంలోకి మారడం ఇక్కడ ప్రత్యేకం. కార్తీకమాసం నెల రోజులపాటు ఈ రెండు క్షేత్రాలు శివనామస్మరణతో మార్మోగుతాయి. దేశంలోని నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు తరలివస్తుంటారు. ముఖ్యంగా సోమవారం రోజుల్లో 70 వేల మంది వరకు భక్తులు వస్తుంటారు.
కార్తీకం ఎంతో పవిత్రమైన మాసం. శైవక్షేత్రాలను సందర్శించి పరమేశ్వరుడికి పూజలు చేయడంతో పాటు నిత్య దీపారాధన చేయాలి. పరమేశ్వరుడికి అభిషేకాలు చేయడం ద్వారా విశేష ఫలితం దక్కుతుంది. నవ వధువులు కార్తీక పౌర్ణమి నాడు ఉపవాసం ఉండి కార్తీక నోములు నోచుకుంటారు. దీపదానం, వస్త్రదానం, వెండి ఆవు, వెండి దూడ దానం, ఉసిరి దానం విశిష్టమైనవి. కాలువల్లో అరటి తెప్పలో దీపాలు పెట్టి వదలడం పుణ్యఫలం.
– అకొండి రాంబాబు, అర్చకులు, గునుపూడి

కార్తీకం.. శివోహం

కార్తీకం.. శివోహం

కార్తీకం.. శివోహం

కార్తీకం.. శివోహం