
దళిత బాలుడిపై దాడి
● ప్రాణాప్రాయ స్థితిలో చికిత్స పొందుతున్న వైనం
● ఆలస్యంగా వెలుగుచూసిన సంఘటన
జంగారెడ్డిగూడెం: మండలంలోని వేగవరం గ్రామానికి చెందిన పదో తరగతి విద్యార్థి, దళిత బాలుడు చైతన్య విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నాడు. కొందరు యువకులు విచక్షణారహితంగా కొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. బాధితులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈనెల 5న వేగవరంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాల ఊరేగింపులో డీజే చూసేందుకు చైతన్య వెళ్లాడు. అయితే ఓ వ్యక్తి ప్రోద్బలంతో కొందరు నిర్వాహక యువకులు నువ్వెందుకు వచ్చావంటూ బాలుడిని ప్రశ్నిస్తూ, కులం పేరుతో దూషించి దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన బాలుడిని కుటుంబసభ్యులు జంగారెడ్డిగూడెం ఏరియా ఆస్పత్రికి, అక్కడి నుంచి ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అక్కడ వైద్యులు పరీక్షించి విజయవాడ రిఫర్ చేశారు. విచక్షణారహితంగా కడుపులో కాలుతో తన్నడం, పిడిగుద్దులు గుద్దడంతో బాలుడి ప్యాంక్రియాస్‌కు తీవ్ర గాయమైంది. ప్యాంక్రియాటిక్ ట్యూబ్ చీలడంతో రక్తస్రావం జరిగి ప్రాణాపాయ స్థితిలో బాలుడు విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అక్కడి నుంచి బాలుడిని గుంటూరు ప్రభుత్వాస్పత్రికి రిఫర్ చేసినట్టు సమాచారం. కాగా బాలుడిపై దాడి చేసిన యువకులంతా జనసేన పార్టీకి చెందిన వారుగా తెలిసింది. ఇదిలా ఉండగా బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, బాలుడికి న్యాయం చేయాలంటూ దళిత సంఘాలు పెద్దెత్తున డిమాండ్ చేస్తున్నాయి. ఆదివారం సాయంత్రం దళితులు వేగవరం జాతీయ ప్రధాన రహదారిపై రాస్తారోకో చేసి ఆందోళన నిర్వహించారు.
అదే రోజు మరిన్ని గొడవలు
ఈనెల 5న శరన్నవరాత్రుల ముగింపు ఉత్సవాలు సమయంలో యువకుల తీరుతో మరో గొడవ జరగడంతో పెద్దలు సర్దుబాటు చేశారు. అలాగే తూర్పు, పడమరపేటలో వేర్వేరు ఉత్సవాల సందర్భంగా ఇరువర్గాల వారు మద్యం సేవించి గొడవలు పడినట్టు తెలిసింది.

దళిత బాలుడిపై దాడి