
విద్య, వైద్యంపై చంద్రబాబుకు చిన్నచూపు
కై కలూరు: విద్య, వైద్యం అంటే ముఖ్యమంత్రి చంద్రబాబుకి చిన్నచూపు అని, ప్రజల ఆరోగ్యాన్ని పెడచెవిన పెడుతున్నారని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు (డీఎన్నార్) విమర్శించారు. ప్రజా వైద్యం, ప్రజల హక్కు అనే నినాదంతో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్‌సీపీ కోటి సంతకాల ప్రజా ఉద్యమంలో భాగంగా నాయకులు, కార్యకర్తలను సమాయత్తం చేసేందుకు కై కలూరు పార్టీ కార్యాలయంలో కై కలూరు, మండవల్లి మండలాల నాయకులు, కార్యకర్తలతో ఆదివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల శాసనమండలిలో చైర్మన్ మోషేన్‌రాజు అడిగిన ప్రశ్నకు వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ పీపీపీ పద్ధతిలో మెడికల్ కాలేజీలను 33 ఏళ్లకు లీజుకు ఇస్తామని, మరో 33 ఏళ్లు కూడా కొనసాగిస్తామని చెప్పారన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్వహణకు రూ.500 కోట్లు కూడా ఖర్చు చేయలేక ప్రైవేటుకు అప్పగించడం దారుణమన్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో మాజీ సీఎం జగన్ హయంలో ఏడు కాలేజీలు పూర్తయ్యాయన్నారు. మరో నాలుగు కాలేజీలు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయన్నారు. ఇక ఆరు కళాశాలలను వచ్చే ఏడాదిలో పూర్తి చేయాల్సి ఉందన్నారు. అయితే కూటమి ప్రభుత్వం ఇందుకు వ్యతిరేకంగా వ్యహరిస్తోందన్నారు. దీనికి నిరసనగా బుధవారం నుంచి నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో కోటి సంతకాల కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు. అనంతరం కోటి సంతకాల పత్రాలను నాయకులకు అందజేశారు. పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు చేబోయిన వీరరాజు, మండవల్లి ఎంపీపీ పెద్దిరెడ్డి శ్రీరామదుర్గాప్రసాద్, పార్టీ రాష్ట్ర రైతు విభాగ సెక్రటరీ సయ్యపురాజు గుర్రాజు, రాష్ట్ర మైనార్టీ విభాగ కార్యదర్శి ఎండీ గాలిబ్‌బాబు, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ జయమంగళ కాసులు, జిల్లా ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్ల విభాగ అధ్యక్షుడు ఎలుగుల వేణుగోపాలరావు, కై కలూరు, మండవల్లి మండల పార్టీ అధ్యక్షులు సింగంశెట్టి రాము, బేతపూడి ఏసేబురాజు, పార్టీ ఎంపీటీసీలు లక్ష్మి, సాదు కొండయ్య, బాలమ్మ, నాగరాజు, వివిధ హోదాల్లోని నాయకులు గుడివాడ తమ్మిస్వామి, షేక్ రఫీ, చిన్నరాజు, అంజి, మాలిక్, ఈదా మురళీ, బుర్ల కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు డీఎన్నార్