
తూర్పు, గాజుల కాపు కులస్తుల ఆత్మీయ సమావేశం
ఏలూరు(మెట్రో): తూర్పు కాపు, గాజుల కాపు కుల సంఘ నాయకుల ఆత్మీయ సమావేశం శుక్రవారం ఏలూరులో నిర్వహించారు. తూర్పు కాపు, గాజుల కాపు కార్పొరేషన్ ఛైర్మన్ యశస్వి అధ్యక్షతన స్థానిక జెడ్పీ మీటింగ్ హాల్‌లో కార్యక్రమాన్ని నిర్వహించారు. బీసీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పుష్పలత మాట్లాడుతూ తూర్పు కాపు, గాజుల కాపు కులస్తులు కుల ధ్రువీకరణ పత్రాలు పొందడంతో ఎదుర్కొంటున్న సమస్యల గురించి చర్చించామన్నారు. తూర్పు కాపు, గాజులు కాపు కార్పొరేషన్ ద్వారా విదేశీ విద్యా పథకం అమలు చేయాలని నాయకులు కోరారు. సమావేశంలో ఆర్‌టీసీ విజయవాడ రీజియన్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు, తూర్పు కాపు కార్పొరేషన్ డైరెక్టర్ లావేటి శ్రీనివాసరావు, డైరెక్టర్ కరణం పెద్ది రాజు తదితరులు పాల్గొన్నారు.
ఏలూరు టౌన్: ఏలూరు నగరంలోని శనగపప్పు పేట, ఇందిరాకాలనీ సమీపంలో ఉంటున్న వ్యక్తి బాత్‌రూంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. త్రీటౌన్ పోలీసులు వివరాల ప్రకారం.. ఎర్ర వెంకటేశ్వరరావు (48) ఆటోడ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుమార్తె భీమవరంలో ఇంజనీరింగ్ చదువుతూ ఉండడంతో గత 9 నెలలుగా అక్కడే భార్య, కుమార్తెతో ఉంటున్నాడు. ఇటీవల ప్రభుత్వం ఆటోడ్రైవర్లకు రూ.15 వేల భృతి డబ్బులు వేస్తుందని, వాటిని తీసుకునేందుకు ఏలూరు వచ్చాడు. అప్పటి నుంచీ ఏలూరులోనే ఉంటున్నాడు. అతను శుక్రవారం మధ్యాహ్నం ఇంటిలోనే ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
యలమంచిలి: బాలికను వేధిస్తున్న కేసులో యువకుడిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు యలమంచిలి ఎస్సై గుర్రయ్య తెలిపారు. పెదలంక గ్రామానికి చెందిన కొల్లి నాని అదే గ్రామానికి చెందిన బాలికను ప్రేమిస్తున్నానంటూ రోజు వేధిస్తున్నాడని ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. బాలిక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.