
కొనసాగుతున్న యూరియా కష్టాలు
పోలవరం రూరల్: యూరియా కొరత లేదంటూ ప్రభుత్వం చెప్పే లెక్కలకు, క్షేత్రస్థాయిలో పరిస్థితులకు పొంతన లేని పరిస్థితి కనిపిస్తోంది. పోలవరం మండలంలోని కృష్ణారావుపేట, పట్టిసీమ, గూటాల, ప్రగడపల్లి సొసైటీల్లో 50.460 మెట్రిక్ టన్నుల యూరియా ఉన్నట్టు వ్యవసాయశాఖ అదికారులు చెబుతున్నారు. సోమవారం ఉదయం పట్టిసీమ, పోలవరం సొసైటీల వద్ద యూరియా కోసం రైతులు బారులు తీరారు. ఆధార్ కార్డులు పట్టుకుని క్యూ కట్టారు. రైతుకు రెండు బస్తాలు యూరియా వంతున పంపిణీ చేపట్టారు. కొన్ని గంటల్లోనే ఉన్న సరకు అయిపోయింది. దీనిపై రైతులు సిబ్బందిని నిలదీయగా, వాదోపవాదాలు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలో పోలవరం ఎస్సై ఎస్‌ఎస్ పవన్‌కుమార్ అక్కడికి చేరుకొని రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. క్యూలో ఉన్నవారికి మాత్రమే బస్తాలు ఇవ్వడంతో ఆ తర్వాత వచ్చినవారు మిగిలిపోయారు. మిగిలిన రైతులు సుమారు 150 మంది వరకు ఉండటంతో వారికి వచ్చే కోటాలో యూరియా ఇస్తామని నచ్చజెప్పారు. వారికి స్లిప్పులు ఇచ్చి యూరియా వచ్చిన వెంటనే ముందుగా ఇచ్చేందుకు ఏర్పాటు చేయడంతో రైతులు శాంతించి వెనుదిరిగారు. యూరియా కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారనడానికి ఇదో తాజా ఉదాహరణ.