
అడవి తల్లి బిడ్డలు.. కొండరెడ్డి గిరిజనులు
బుట్టాయగూడెం: పశ్చిమ ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసీ గిరిజన తెగల్లో కొండరెడ్డి గిరిజనుల తెగ ఒకటి. వీరు నేటికీ కొండలపై ఆవాసాలు ఏర్పాటు చేసుకుని నివాసం ఉంటున్నారు. అక్కడే వారి సాంప్రదాయ పంటలైన జొన్న, సామలు, మొక్కజొన్న వంటి పంటలను పండిస్తూ జీవనం సాగిస్తున్నారు. అలాగే పలు గ్రామాల్లో వెదురు అల్లికలు, తేనె, చింతపండు, ఇప్ప పువ్వు వంటి అటవీ ఉత్పత్తులను సేకరిస్తుంటారు. వారాంతపు సంత, ఇతర ప్రభుత్వ కార్యాలయ పనుల మీద మాత్రమే కొండ దిగి కిందకు వస్తుంటారు. వీరికి ప్రధానంగా పోడు వ్యవసాయమే జీవనాధారం. సాతంత్య్రం వచ్చి 79 ఏళ్లు కావొస్తున్నా నేటికీ కొండరెడ్డి గిరిజనులు కొండ ప్రాంతంలోనే జీవనం సాగిస్తూ వస్తున్నారు. ప్రకృతి మాత వడిలోనే జీవిస్తున్నారు.
నేటికీ చెక్కుచెదరని సాంప్రదాయం
నేటి ఆధునిక ప్రపంచంలో ఎవరి బ్రతుకులు వారివే, ఎవరి పనులు వారివే. అయితే కొండరెడ్డి గిరిజనులు నేటికీ నాటి సాంప్రదాయాలు, ఆచారాలకు కట్టుబడి ఉన్నారు. వ్యవసాయమే కాదు పెళ్లిళ్లు, పేరంటాలు ప్రతిదీ సమష్టిగా చేసుకునే సాంప్రదాయం కొనసాగుతూనే ఉంది. శుభకార్యాల్లో ఒకరికి ఒకరు సహకరించుకోవడం వంటివి నేటికీ చేస్తుంటారు.
ప్రకృతే గిరిజనుల ఆరాధ్య దైవం
ఆదివాసీ గిరిజనులు ప్రకృతినే ఆరాధ్య దైవంగా కొలుస్తుంటారు. రావి, వేప చెట్లను ముత్యాలమ్మగా భావిస్తారు. ముఖ్యంగా బాట పండుగ, పప్పుల పండుగ, మామిడికాయ పండుగ వంటి పండుగలను ఎంతో వైభవంగా చేస్తారు. అయితే గిరిజనుల్లోనే కోయ తెగ వారు భూదేవి పండుగను తొలకరి సమయంలో ఎంతో వైభవంగా నిర్వహిస్తారు. నేటికీ ఈ పండుగ సాంప్రదాయం కొనసాగుతూనే ఉంది.
గత ప్రభుత్వ పాలనలో గిరిజన సంక్షేమానికి పెద్దపీట
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ పాలనలో పెద్దపీట వేశారు. సుమారు 3,220 మంది గిరిజనులకు 69814.72 ఎకరాల్లో పోడు భూములకు పట్టాలిచ్చారు. అదేవిధంగా రైతు భరోసా పథకంలో రైతులకు ప్రతీ ఏటా రూ. 15000 పెట్టుబడి సాయం అందేలా కృషి చేశారు. అలాగే ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ విధానంతో కొండ ప్రాంతంలో నివసిస్తున్న గిరిజనులకు సైతం మెరుగైన వైద్యసేవలు అందించే విధంగా కృషి చేశారు. అలాగే వలంటీర్ వ్యవస్థ ద్వారా పింఛన్లు కూడా కొండపైన ఉన్నవారికి కూడా ఇంటికే అందే విధంగా చర్యలు తీసుకున్నారు. గిరిజనులకు మెరుగైన వైద్యసేవలు అందేలా సుమారు రూ. 50 కోట్లతో మల్టీస్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణానికి పూనుకున్నారు. అయితే ప్రస్తుతం నిర్మాణ పనులు నిలిచిపోయాయి. అలాగే మారుమూల గ్రామాల నుంచి డోలి కష్టాలు కూడా లేకుండా బైక్ అంబులెన్స్ సేవలను అందించారు.
ప్రకృతే వారి ఆరాధ్య దైవం
నేడు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం
గిరిజనులకు మళ్లీ కష్టాలు మొదలు..
కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన పథకాలకు ఒక్కొక్కటిగా మంగళం పలకుతుంది. గతంలో ఎండీయూ వాహనాల ద్వారా ఇంటింటికి రేషన్ అందించేవారు. అయితే ప్రస్తుతం దానిని తొలగించడంతో మళ్లీ గిరిజనులకు వాగులు దాటుతూ తలపై బియ్యం పెట్టుకుని మైళ్ల దూరం నడిచే పరిస్థితులు వచ్చాయి. గతంలో వలంటరీ వ్యవప్థ ద్వారా కోడి కూయక ముందే మారుమూల కొండ ప్రాంతాల్లో ఉన్న వారికి సైతం అన్ని రకాల పింఛన్లు అందేవి. ప్రస్తుతం ఆ పింఛన్లు వారం రోజులు దాటితేకానీ అందే పరిస్థితి లేదని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా వైద్యసేవలపై కూడా ఆందోళన చెందుతున్నారు. అయితే ప్రస్తుత ప్రభుత్వ పాలకులు తమకు ఎటువంటి ఇబ్బంది కలుగకుండా పాలన సాగించాలని గిరిజనులు కోరుతున్నారు.

అడవి తల్లి బిడ్డలు.. కొండరెడ్డి గిరిజనులు

అడవి తల్లి బిడ్డలు.. కొండరెడ్డి గిరిజనులు

అడవి తల్లి బిడ్డలు.. కొండరెడ్డి గిరిజనులు

అడవి తల్లి బిడ్డలు.. కొండరెడ్డి గిరిజనులు

అడవి తల్లి బిడ్డలు.. కొండరెడ్డి గిరిజనులు