
పాములదిబ్బలో ఉద్రిక్తత
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): స్థానిక పాములదిబ్బలో మరోసారి ఉద్రిక్తత చోటుచేసుకుంది. రెండు నెలల క్రితం పాములదిబ్బకు చెందిన ముంగి యర్రబాబు ఏలూరు జాతీయ రహదారిపై హత్యకు గురయ్యాడు. ఈ కేసులో పాములదిబ్బ ప్రాంతానికి చెందిన కొందరు నిందితులుగా ఉండటంతో పోలీసులు వాళ్లను అరెస్ట్ చేశారు. హత్యకు గురైన వ్యక్తిని దహన సంస్కారానికి తీసుకువెళ్లే సమయంలోనే హతుడి కుటుంబ సభ్యులు నిందితుల ఇంట్లో సామాన్లు ధ్వంసం చేసి గందరగోళం సృష్టించారు. అప్పట్లో ఏలూరు డీఎస్పీ శ్రవణ్ కుమార్ ప్రత్యేక నిఘా, పోలీసు పికెట్ ఏర్పాటు చేసి శాంతిభద్రతలకు విఘాతం కలుగకుండా చర్యలు చేపట్టారు. ఈ విషయం సద్దుమణిగినా నివురుగప్పిన నిప్పులా ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ క్రమంలోనే శుక్రవారం తెల్లవారుజామున హత్య కేసులో నిందితుడిగా ఉన్న దాసరి కుమార్ రాజా ప్రత్యర్థులు ఇంటికి నిప్పుపెట్టారు. దీంతో మళ్లీ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేశారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ఏలూరు టూటౌన్ సీఐ అశోక్ కుమార్ ఆధ్వర్యంలో పాములదిబ్బలో మళ్లీ పోలీసు భద్రతను ఏర్పాటు చేశారు. ఇంటికి నిప్పు పెట్టిన ఘటనకు సంబందించి హత్యకు గురైన యర్రబాబు తల్లి పెద్దింట్లుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.