
యాసిడ్ మీద పడి మహిళ మృతి
పెదపాడు: రోడ్డు ప్రమాదంలో యాసిడ్ మీద పడి ఓ మహిళ మృతి చెందగా భర్తకు గాయాలైన సంఘటన పెదపాడు మండలంలోని తాళ్లమూడిలో శుక్రవారం చోటు చేసుకుంది. పెదపాడు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గుంటూరు నుంచి ఏలూరుకు యాసిడ్ లోడుతో వెళ్తున్న ట్రక్కు ఆటోలో అల్లాబక్సు అనే వ్యక్తి తన భార్య షంషేర్‌తో కలిసి వెళ్తున్నారు. జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్న వారు మార్గమధ్యలో పెదపాడు మండలంలోని తాళ్లమూడి వద్దకు వచ్చేసరికి టైర్ పంక్చర్ కావడంతో ఆటో బోల్తా పడింది. దీంతో ఆటోలో ఉన్న యాసిడ్ మీదపడి భార్య షంషేర్(46) అక్కడికక్కడే చనిపోయింది. యాసిడ్ గాయలైన భర్తను ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై మేజిస్ట్రేట్ వద్ద బాధితుడి వాంగ్మూలం నమోదు చేసినట్లు తెలిపారు. బాధితులు నెలకు రెండు సార్లు ఈ విధంగా యాసిడ్ తీసుకువచ్చి ఏలూరులో దుకాణాలకు సరఫరా చేస్తూ జీవనం సాగిస్తూ ఉంటారని చెప్పారు. ఈ మేరకు పెదపాడు ఎస్సై కట్టా శారదా సతీష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తృటిలో తప్పిన పెనుప్రమాదం
కై కలూరు: కేవలం 10 నిమషాలు అగ్నిమాపక సిబ్బంది ఆలస్యంగా వస్తే భారీ ప్రమాదం జరిగేది. కై కలూరు వెలంపేట మరిపి నాగేశ్వరరావు ఇంటి వద్ద వంట చేస్తున్న సమయంలో ఎల్‌పీజీ సిలిండర్ గ్యాస్ పైప్‌ను నుంచి ఒక్క సారిగా మంటలు వ్యాపించాయి. మంటలను అదుపు చేసినా ప్రయోజనం లేకపోవడంతో సమీప నివాసితులు భయంతో అరుస్తూ పరుగులు తీశారు. కొంతమంది ఫైర్ ఆఫీస్‌కు సమాచారం ఇవ్వడంతో సిబ్బంది వచ్చి సిలిండరు నుంచి వచ్చే మంటలను అదుపు చేశారు. అప్పటికే సిలిండర్ పేలడానికి సిద్ధంగా ఉంది. సకాలంలో స్పందించిన అగ్నిమాపక సిబ్బందిని స్థానికులు అభినందించారు.