
విద్యుదాఘాతంతో ఆయిల్‌పామ్ కార్మికుడి మృతి
జంగారెడ్డిగూడెం: విద్యుదాఘాతానికి గురై ఆయిల్ పామ్ కార్మికుడు మృతిచెందాడు. వివరాల ప్రకారం మండలంలోని తాడువాయి పరిధిలో గొల్లగూడెంలో చెరుకు ఫ్యాక్టరీ సమీపంలో రైతు కొప్పుల నాగేశ్వరరావు ఆయిల్ పామ్ తోటను లీజుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాడు. ఈ తోటలోని ఆయిల్ పామ్ గెలలు నరికేందుకు జీలుగుమిల్లి మండలం స్వర్ణవారిగూడెంకు చెందిన తడికమళ్ల రమేష్ (35) శుక్రవారం పనికి వచ్చాడు. అక్కడ ఆయిల్ పామ్ గెలలు కోస్తుండగా, సమీపంలో ఉన్న విద్యుత్ లైన్‌కు గెలులు నరికే గెడ తగలడంతో విద్యుత్ ప్రవహించి అక్కడికక్కడే మృతిచెందాడు. మృతునికి భార్య చుక్కమ్మ, ఒక పాప ఉన్నారు. దీనిపై భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై షేక్ జబీర్ తెలిపారు.
ఆయిల్ పామ్ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి
ఆయిల్ పామ్ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని ఆయిల్ పామ్ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి తుమ్మల సత్యనారాయణ, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ఎం.జీవరత్నం తెలిపారు. శుక్రవారం ఆయిల్ పామ్ కార్మికుడు తడికమళ్ల రమేష్ మృతిచెందడంతో ఘటనా స్థలానికి వెళ్లి కుటంబసభ్యులను పరామర్శించి ఓదార్చారు. కార్మికుల కుటుంబాలను ఆదుకునేవిధంగా ఆయిల్ పామ్ కంపెనీ గ్రూప్ ఇన్సూరెన్స్ ఏర్పాటు చేసి, రూ.10 లక్షలు వ్యక్తిగత భీమా ఇవ్వాలన్నారు. అలాగే ఆయిల్ పామ్ గెలలు సురక్షితంగా కోసే విధంగా కార్మికులకు శిక్షణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.