
తవ్వుకో.. తరలించుకో..!
ద్వారకాతిరుమల: పచ్చనేతల అక్రమాలకు అడ్డే లేకుండా పోతోంది. మట్టి కనిపిస్తే చాలు తవ్వుకుని, అమ్ముకుంటున్నారు. అడిగేవారు.. అడ్డుచెప్పే వారు లేకపోవడంతో రోజురోజుకీ వీరి ఆగడాలు పెచ్చుమీరుతున్నాయి. ద్వారకాతిరుమల మండలం వెంకటకృష్ణాపురం గ్రామంలో ఏకంగా జగనన్న కాలనీ ఇళ్ల స్థలాల్లోనే గురువారం గ్రావెల్ తవ్వకాలు జరిపారు. లబ్ధిదారులు వారిని అడ్డుకోవడంతో తవ్వకాలు తాత్కాలికంగా నిలిచాయి. వివరాల్లోకి వెళితే.. గత వైఎస్సార్ సీపీ ప్ర భుత్వంలో వెంకటకృష్ణాపురం గ్రామంలోని వాటర్ ట్యాంక్ సమీపంలో పలువురు లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలను ఇచ్చారు. అందులో ఎవరూ ఇళ్లను నిర్మించుకోలేదు. అయితే కొందరు టీడీపీ నాయకులు రెండు పొక్లెయిన్లతో ఆ ఖాళీ ఇళ్ల స్థలాల్లో తవ్వకాలు జరిపి, గ్రావెల్‌ని రామన్నగూడెం గ్రామానికి టిప్పర్లు, ట్రాక్టర్ల ద్వారా తరలించేస్తున్నారు. ఆ గ్రావెల్‌ని ఎంతకు అమ్ముతున్నారన్నది బయటకు పొక్కనివ్వలేదు. ఇదిలా ఉంటే ఇళ్ల స్థలాల లబ్ధిదారులు ఈ తవ్వకాలను అడ్డుకున్నారు. సమాచారం అందుకున్న గ్రామ రెవెన్యూ అధికారి కూడా అక్కడికి చేరుకున్నారు. ఆ సమయంలో ఓ టీడీపీ నాయకుడు లబ్ధిదారులపై చిందులు వేసినా, అవి అక్రమ తవ్వకాలు కావడంతో నెమ్మదిగా అక్కడి నుంచి జారుకున్నాడని స్థానికులు చెబుతున్నారు. సంబంధిత అధికారులు అక్రమంగా మట్టి తవ్వకాలు జరిపే వారిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
జగనన్న కాలనీ ఇళ్ల స్థలాల్లో గ్రావెల్ అక్రమ తవ్వకాలు
వెంకటకృష్ణాపురంలో బరి తెగించిన పచ్చ నేతలు

తవ్వుకో.. తరలించుకో..!