
మావుళ్లమ్మకు శ్రావణమాస ఉత్సవాలు ప్రారంభం
భీమవరం (ప్రకాశంచౌక్): స్థానిక శ్రీ మావుళ్ళమ్మ వారి దేవస్థానంలో శ్రావణమాసం ఉత్సవాలు శుక్రవారంతో నుంచి ప్రారంభమాయ్యాయి. దేవస్థానం ప్రధాన అర్చకులు మద్దిరాల మల్లికార్జున శర్మ ఆధ్వర్యంలో ఉదయం నుంచే అమ్మవారికి వైదిక కార్యక్రమాలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు దర్శనానికి తరలివచ్చారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా దేవస్థానం సహాయ కమిషనర్ బుద్ద మహాలక్ష్మి నగేష్ ఏర్పాట్లను పర్యవేక్షించారు.
మున్సిపల్ కార్యాలయంలో అగ్నిప్రమాదం
జంగారెడ్డిగూడెం : స్థానిక మున్సిపల్ కార్యాలయంలో శుక్రవారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. కమిషనర్ చాంబర్‌లో విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ కారణంగా కంప్యూటర్ లాప్‌టాప్, ఫర్నీచర్, ఏసీ, విద్యుత్ ఉపకరణాలు దగ్ధమయ్యాయి. ఘటనాస్థలాన్ని మున్సిపల్ ఛైర్‌పర్సన్ బత్తినలక్ష్మి పరిశీలించారు. అగ్ని ప్రమాద విషయాన్ని ఉన్నతాధికారులతో పాటు, విద్యుత్ శాఖ, పోలీసు శాఖకు సమాచారం ఇచ్చామన్నారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియజేయాలని కమిషనర్ కేవీ రమణను ఛైర్‌పర్సన్ ఆదేశించారు. వైస్ చైర్మన్ ముప్పిడి ఆంజనేయులు, కౌన్సిలర్‌లు చిటికెల అచ్యుతరామయ్య, పీపీఎన్ చంద్రరావు, లోకారపు వెంకటేశ్వరరావు అగ్నిప్రమాద ప్రాంతాన్ని పరిశీలించారు.
7 నుంచి శ్రీవారి పవిత్రోత్సవాలు
ద్వారకాతిరుమల: ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకాతిరుమల చినవెంకన్న ఆలయంలో ఆగస్టు 7 నుంచి పదో తేదీ వరకు స్వామివారి దివ్య పవిత్రోత్సవాలను నిర్వహించనున్నట్టు ఆలయ ఈఓ ఎన్‌వీ సత్యన్నారాయణ మూర్తి తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. 7న అంకురార్పణతో ఈ ఉత్సవాలకు శ్రీకారం చుడతారని తెలిపారు. అలాగే 8న పవిత్రాదివాసం, 9న పవిత్రావరోహణ, ఉత్సవాల్లో ఆఖరి రోజైన 10న ఆలయ యాగశాలలో మహా పూర్ణాహుతి వేడుకలు కన్నులపండువగా జరుగుతాయని పేర్కొన్నారు. ఈ ఉత్సవాలు జరిగే నాలుగు రోజులు ఆలయంలో స్వామివారికి నిత్యార్జిత కల్యాణాలు, ఆర్జిత సేవలను రద్దు చేస్తున్నట్టు ఈఓ తెలిపారు.
పురోహితుడి ఆత్మహత్య
ఉంగుటూరు: అప్పుల బాధ తాళలేక మండలంలోని రాచూరు గ్రామానికి చెందిన ఓ పురోహితుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాల ప్రకా రం రాచూరు గ్రామంలోని పల్లాలమ్మ ఆలయ పూజారిగా పని చేస్తున్న రుద్రపాక లీలా శివ వీరకుమార్ (53) శుక్రవారం మధ్యాహ్న సమయంలో పురుగుల మందు తాగి నారాయణపురం–రాచూరు రహదారిలో పడిపోయి ఉండడాన్ని స్థానికులు గమనించారు. తాడేపల్లిగూడెం ప్రభుత్వాస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ రాత్రి మరణించాడు. ఆస్పత్రి నుంచి వచ్చిన సమాచా రం మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. వీరకుమార్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

మావుళ్లమ్మకు శ్రావణమాస ఉత్సవాలు ప్రారంభం