
శ్రీవారి హుండీ ఆదాయం రూ. 2.82 కోట్లు
ద్వారకాతిరుమల: ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకాతిరుమల చినవెంకన్న ఆలయ హుండీల నగదు లెక్కింపు స్థానిక ప్రమోద కల్యాణ మండపంలో గురువారం అత్యంత కట్టుదిట్టమైన భద్రతల నడుమ జరిగింది. ఈ లెక్కింపులో శ్రీవారికి విశేష ఆదాయం సమకూరింది. గడచిన 30 రోజులకు గాను నగదు రూపేణా స్వామివారికి రూ. 2,82,31,619 ఆదాయం లభించినట్టు ఆలయ ఈఓ ఎన్‌వీ సత్యన్నారాయణ మూర్తి తెలిపారు. అలాగే కానుకల రూపేణా భక్తులు సమర్పించిన 202 గ్రాముల బంగారం, 5.546 కేజీల వెండితో పాటు, అధికంగా విదేశీ కరెన్సీ లభించిందన్నారు. అదేవిధంగా లెక్కింపులోకి రాని రదైన పాత రూ. 2000, రూ.500 నోట్లు ద్వారా రూ.35,500 లభించినట్టు చెప్పారు. ఈ లెక్కింపులో ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
మావుళ్లమ్మ హుండీ ఆదాయం రూ.88.69 లక్షలు
భీమవరం (ప్రకాశం చౌక్): భీమవరం పట్టణ ఇలవేల్పు శ్రీ మావుళ్లమ్మవారి ఆలయంలో భక్తులు హుండీల ద్వారా సమర్పించిన కానుకలను గురువారం లెక్కించినట్లు ఆలయ సహాయ కమిషనర్, కార్యనిర్వహణదికారి బుద్ధ మహాలక్ష్మి నగేష్ తెలిపారు. 114 రోజుల కాలానికి మొత్తం ఆదాయం రూ.88,69,425, బంగారం 92.500 గ్రాములు, వెండి 623.500 గ్రాములు, పలు దేశాల విదేశీ కరెన్సీ లభించిందన్నారు. లెక్కింపులో ఆలయ ప్రధానార్చకులు మద్దిరాల మల్లికార్జున శర్మ, దేవదాయశాఖ అధికారి వి.హరిసూర్యప్రకాశ్, శ్రీ శక్తీశ్వర స్వామి దేవస్థానం యనమదుర్రు ఈఓ దండు కృష్ణంరాజు, కొణితివాడ గ్రూప్ టెంపుల్స్ ఈఓ కర్రి శ్రీనివాస్, కరూర్ వైశ్య బ్యాంకు సిబ్బంది, పోలీస్, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.
క్షీరారామలింగేశ్వరస్వామి హుండీ ఆదాయం రూ.13 లక్షలు
పాలకొల్లు సెంట్రల్: పంచారామక్షేత్రం శ్రీ క్షీరారామలింగేశ్వరస్వామి ఆలయంలో స్వామివారి హుండీ ఆదాయం రూ.13,31,554 వచ్చింది. గురువారం దేవదాయ శాఖ తనిఖీ అధికారి వి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో హుండీలను లెక్కించారు. మూడు నెలల 28 రోజులకు గాను ఈ ఆదాయం వచ్చినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి ముచ్చర్ల శ్రీనివాసరావు తెలిపారు. కార్యక్రమంలో వెంకటేశ్వరరావు సేవా వలంటీర్స్, భాగ్యలక్ష్మి సేవా సభ్యులు, రెవెన్యూ, పోలీసు, బ్యాంక్ ఆఫ్ ఇండియా సిబ్బంది, ఆలయ సూపరింటెండెంట్ పసుపులేటి వాసు, సీనియర్ అసిస్టెంట్ గాంధీ, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.