ఏలూరు(మెట్రో): సమాజంలో ఆర్థిక అసమానతలు తొలగించి పేదరికం లేని సమాజాన్ని రూపొందించాలన్నదే పీ4 కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని జిల్లా ఇన్‌చార్జి మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. కలెక్టరేట్లోని గోదావరి సమావేశపు హాలులో బుధవారం జిల్లాలోని పారిశ్రామికవేత్తలు, వివిధ సంస్థల ప్రతినిధులు, అధికారులతో ఏర్పాటుచేసిన సమావేశంలో పీ4 కార్యక్రమం ఉద్దేశాలను తెలిపి, అధికారులతో మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సమాజంలో 10 శాతంగా ఉన్న ధనవంతులు, అట్టడుగు స్థాయిలో ఉన్న 20 మంది నిరుపేదల జీవన ప్రమాణాల స్థాయిని పెంచేందుకు చేయూత నివ్వడమే పీ4 లక్ష్యమన్నారు. జిల్లాలో 95 వేల మంది బంగారు కుటుంబాలను గుర్తించామని, వారిలో ఇంతవరకు 5,181 కుటుంబాలకు మార్గదర్శకులు అండగా నిలబడ్డారన్నారు. బంగారు కుటుంబాలలో సమస్యలు తెలుసుకుని, ఆయా కుటుంబాలలోని పిల్లలకు విద్య, వారి జీవనోపాధికి అవసరమైన, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడం, ఆ కుటుంబం అభివృద్ధి వైపు అడుగులు వేసేలా మార్గదర్శి చేయూత అందిస్తారన్నారు. కలెక్టర్ కె.వెట్రిసెల్వి మాట్లాడుతూ జిల్లాలో పీ4 కార్యక్రమంలో సర్వే నిర్వహించి 99,905 బంగారు కుటుంబాలను గుర్తించామని, ఇంతవరకు 5181 కుటుంబాలకు మార్గదర్శకులు అండగా నిలబడ్డారన్నారు. జెడ్పీ చైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీ, ఎమ్మెల్యేలు చింతమనేని ప్రభాకర్, సొంగా రోషన్ కుమార్, జాయింట్ కలెక్టర్ ధాత్రిరెడ్డి పాల్గొన్నారు.
పీ–4 మార్గదర్శకుల గుర్తింపుపై అవగాహన
పీ4 కార్యక్రమంలో భాగంగా మార్గదర్శకుల గుర్తింపు, బంగారు కుటుంబాల అనుసంధానం అంశంపై నియోజకవర్గ ప్రత్యేక అధికారులు, ఎంపీడీవోలు, పీ4 సర్వే విజన్ టీం సభ్యులతో శిక్షణ కార్యక్రమాన్ని కలెక్టరు కె.వెట్రిసెల్వి బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టరు మాట్లాడుతూ జిల్లాలో 547 గ్రామ పంచాయతీలలో గ్రామ సభలు నిర్వహించి, శాసనసభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొనేలా చూడాలన్నారు. సర్వేలు జరపాలని అలాగే గ్రామ సభలు నిర్వహించి, పూర్తి వివరాలు యాప్‌లో అప్‌లోడ్ చేసి పూర్తి స్థాయి నివేదికలు జిల్లా కార్యాలయానికి పంపాలన్నారు.