
స్మార్ట్ మీటర్ల బిగింపును వ్యతిరేకించాలి
ఏలూరు (టూటౌన్): విద్యుత్ స్మార్ట్ మీటర్లు బిగింపును ప్రజలంతా వ్యతిరేకించాలని వామపక్ష, ప్రజా సంఘాల ఐక్యవేదిక పిలుపునిచ్చింది. విద్యుత్ స్మార్ట్ మీటర్లను వ్యతిరేకిస్తూ మంగళవారం ఉదయం ఏలూరు సీపీఐ జిల్లా కార్యాలయం స్ఫూర్తి భవనంలో వామపక్ష ప్రజాసంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. సీపీఐ ఏలూరు జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య అధ్యక్షత వహించారు. ఈ నెల 13న విజయవాడ దాసరి భవన్‌లో స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా చేసిన ఉద్యమ కార్యాచరణను కృష్ణ చైతన్య వివరించారు. గత కొంతకాలంగా విద్యుత్ వినియోగదారులపై ట్రూ అప్ చార్జీలు, ఇంధన సర్దుబాటు చార్జీలు, ఇతర అదనపు చార్జీల పేరుతో అధిక భారాన్ని మోపుతూ వసూలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలపై మోపిన అధిక భారాలను రద్దు చేయాలని, వసూలు చేసిన అదనపు బిల్లులను తిరిగి చెల్లించాలని, విద్యుత్తు స్మార్ట్ మీటర్లు బిగింపు కార్యక్రమాన్ని విడనాడాలని డిమాండ్ చేశారు. స్మార్ట్ మీటర్లు బిగింపును విరమించుకోకపోతే మరో బషీర్‌బాగ్ లాంటి విద్యుత్ ఉద్యమాన్ని ఎదుర్కొవాల్సి వస్తుందని హెచ్చరించారు. రౌండ్ టేబుల్ సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కె.రామకృష్ణ, సీపీఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు బద్దా వెంకట్రావు, ఎంసిపిఐ(యు) జిల్లా నాయకులు ఎస్.నాగరాజు, బీకేఎంయు జిల్లా ప్రధాన కార్యదర్శి బండి వెంకటేశ్వరరావు, ఏఐటీయూసీ జిల్లా గౌరవ అధ్యక్షులు కృష్ణమాచార్యులు, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి రాయంకుల లక్ష్మణరావు, సీపీఐ ఏలూరు ఏరియా కార్యదర్శి హేమశంకర్ పాల్గొన్నారు.