
ఆర్టీసీ ఏసీ బస్సుల్లో ఆషాఢం ఆఫర్
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఆర్టీసీ ఏసీ బస్సుల ప్రయాణికులకు ఆషాఢం ఆఫర్ అందిస్తున్నట్టు ఏలూరు జిల్లా ప్రజా రవాణా అధికారి షేక్ షబ్నం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని ఏలూరు, జంగారెడ్డిగూడెం, నూజివీడు ఆర్టీసీ డిపోల నుంచి బయలుదేరే అన్ని ఏసీ బస్సుల్లో ప్రయాణికులకు వెళ్లేటప్పుడు 10 శాతం, తిరిగి వచ్చేటప్పుడు 10 శాతం ప్రయాణ చార్జీల్లో రాయితీ ఇస్తున్నట్టు తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఉరి వేసుకుని యువతి ఆత్మహత్య
భీమడోలు: గుండుగొలనులో ఓ యువతి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మంగళవారం ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల ప్రకారం.. గ్రామంలోని ఎస్సీ కాలనీకి చెందిన సిరికోటి నర్మద అలియాస్ మౌనిక (20) ఈనెల 13వ తేదీ ఆదివారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ సభ్యులు ఇంటికి వచ్చే సరికి ఆమె విగత జీవిగా పడి ఉంది. ప్రేమ వ్యవహారమే యువతి మృతికి కారణమని అనుమానిస్తున్నారు. నర్మద అమ్మమ్మ కురమా మాణిక్యం ఫిర్యాదు మేరకు భీమడోలు ఎస్సై వై.సుధాకర్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఫిట్స్‌తో కాలువలో పడి..
భీమవరం: ఫిట్స్‌తో ప్రమాదవశాత్తు కాలువలో పడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వ్యక్తి మృతి చెందాడు. భీమవరం టూటౌన్ ఎస్సై కె రామారావు తెలిపిన వివరాలివి. పట్టణంలోని సత్యవతి నగర్‌కు చెందిన గుమ్మాడి రామచంద్రరావు(32) ఈనెల 13వ తేదీన ఫిట్స్‌తో కాలువలో పడిపోయాడు. అతడిని బంధువులు ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చగా చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. రామచంద్రరావు తల్లి రత్నకుమారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
చేపల పెంపకంపై శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం
ఏలూరు (టూటౌన్), బాదంపూడి: ఉంగుటూరు మండలం బాదంపూడిలోని దేశీయ జల మత్స్య సంవర్థణ శిక్షణ కేంద్రంలో చేపల పెంపకంపై శిక్షణ పొందుటకు ఈనెల 25వ తేదీ లోగా దరఖాస్తు చేసుకోవాలని జిల్లా మత్స్య శాఖ అధికారి బి.నర్సయ్య మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉపకార వేతనాలు లేకుండా 20 సీట్లు ఉన్నాయన్నారు. 5వ తరగతి ఆపైన చదువుకుని చేపల పెంపకంపై ఆసక్తి కలిగిన 18 నుంచి 30 సంవత్సరాల లోపు ఉన్న వ్యక్తులు అర్హులన్నారు. దరఖాస్తుదారులకు ఈ నెల 29వ తేదీ ఉదయం 11 గంటలకు బాదంపూడిలోని మత్స్య శాఖ సహాయ సంచాలకుల వారి కార్యాలయంలో ఇంటర్వ్యూలు నిర్వహించి అదేరోజు సాయంత్రం కార్యాలయం నోటీసు బోర్డులో ఎంపికై న వారి జాబితా ప్రదర్శించడం జరుగుతుందన్నారు. శిక్షణా కాలం ఆగస్టు 1 నుంచి అక్టోబరు 31వ తేదీ వరకు మూడు నెలలపాటు ఉంటుందన్నారు. వివరాలకు మత్స్య సహాయ సంచలకులు, బాదంపూడి 95733 37484 లేదా మత్స్య అభివృద్ధి అధికారి, బాదంపూడి–1 72869 93033, బాదంపూడి–2 94923 37469 నంబర్లలో సంప్రదించాలని జిల్లా మత్స్య శాఖాధికారి నర్సయ్య తెలియజేశారు.
నీటితీరువా పన్నులు చెల్లించండి
ఏలూరు (మెట్రో): జిల్లాలో నీటితీరువా పన్నులను ‘మన మిత్ర’ యాప్ ద్వారా చెల్లించవచ్చని జిల్లా రెవెన్యూ అధికారి వి.విశ్వేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు. రైతులు ‘మన మిత్ర’ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని నీటితీరువా పన్నులను చెల్లించాలన్నారు. ఏదైనా సమస్య ఉంటే సెల్ 95523 00009లో సంప్రదించాలన్నారు.