
పశువుల ప్రాణాలకే ముప్పు
బుట్టాయగూడెం: వర్షాకాలంలో పశువులకు వ్యాధులు సంభవించే అవకాశముందని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పశుసంవర్థకశాఖ అధికారులు సూచిస్తున్నారు. పశువులు, గొర్రెలు ఇతరత్రా జీవాలకు వచ్చే వ్యాధులను గుర్తించిన వెంటనే సకాలంలో అందుబాటులో ఉన్న పశువైద్యాధికారిని సంప్రదించి సరైన చికిత్స చేయించాలని సూచిస్తున్నారు. అలాగే ముందస్తు జాగ్రత్తలు పాటిస్తే వ్యాధులు రాకుండా కాపాడుకోవచ్చని చెబుతున్నారు.
బ్లూటంగ్– ఫూట్‌రాట్ లక్షణాలు
గొర్రెలు, మేకల్లో బ్లూటంగ్ వ్యాధులు సోకితే ఎక్కువగా జ్వరం, మూతివావు, పెదవులు దద్దర్లు, నోటిలోపల పుండ్లు, ముక్కులో చీమిడి, కాళ్లు కుంటడం, ఒంట్లో నీరు చేరడం, పారుకోవడం, మేత మేయకపోవడం, అలాగే ఈసుకుపోవడం (అబార్షన్‌లు) వంటి లక్షణాల వలన 30 శాతం వరకూ మరణాలు సంభవిస్తాయి. వీటి నివారణకు సాయంత్రం సమయంలో గొర్రెల మందలో వేపాకు పొగ పెట్టుకుంటూ అప్పుడప్పుడూ బ్లూటాక్స్/టిక్కిల్ మందులు పిచికారీ చేస్తూ పోడు ప్రాంతాల్లో మేతకు తీసుకువెళ్లాలి
కాళ్లపుండ్లు వ్యాధి సోకితే
జీవాలకు కాళ్లపుండ్లు వ్యాధి సోకితే కాలి గిట్టల మధ్య చీము చేరి చెడువాసన వస్తుంది. అలాగే గొర్రెలు కుంటుతూ నడుస్తాయి. ఈ లక్షణాలు కనిపిస్తున్నప్పుడు జీవాలను బురద ప్రాంతంలో మేపకూడదు. పొడి ప్రాంతంలోనే మేత వేసే విధంగా చూడాలి.
గొంతువాపు వ్యాధి
పశువులకు సోకే వ్యాధుల్లో గొంతువాపు వ్యాధి ప్రమాదకరం. ఈ వ్యాధిని గురకవ్యాధి అని కూడా పిలుస్తారు. వర్షాకాలంలో సూక్ష్మజీవుల వల్ల ఈ వ్యాధి పశువులకు సంక్రమిస్తుంది. తొలకరి వర్షాలు పడిన సమయంలో కలుషితమైన నీటి ద్వారా, మేత ద్వారా పశువులకు రోగ నిరోధక శక్తి తగ్గడం వల్ల ఈ వ్యాధుల బారిన పడతాయి. గొంతువాపు వ్యాధి బారిన పడిన పశువులను మిగిలిన పశువులతో కలిపి ఉంచితే ఈ వ్యాధి మిగిలిన వాటికి కూడా వ్యాప్తి చెందుతుంది. ఒకేపాకలో మిగతా వాటితో ఉంచకుండా వేరుగా ఉంచాలి. అలాగే వర్షాకాలంలో పశువులు వర్షాలకు తడవకుండా చూడాలి.
నివారణ చర్యలు
జూన్, జులై, ఆగష్టు నెలలో వ్యాధి నిరోధక టీకాలు వేయించాలి. పౌష్టికాహారం అందించాలి. వ్యాధిసోకిన పశువులను మిగిలినవాటి నుంచి వేరు చేయాలి. వాటి స్థావరాలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉండేలా చూడాలి.
చిటిక వ్యాధి
ఇది గొర్రెల్లో ఎక్కువగా వస్తుంది. ఎంటరోటాక్సీమియా అనే బ్యాక్టీరియా వల్ల తొలకరి వర్షాలు కురిసే సమయంలో ఈ వ్యాధి గొర్రెలకు సోకుతుంది. ఏడాది వయస్సు గల గొర్రెల్లో ఈ వ్యాధి వస్తుంది. ఈ వ్యాధిసోకిన గొర్రెలు నీరసించి కొద్దిసేపటికే గిలగిలా కొట్టుకుని గాలిలో ఎగిరి కిందపడి మరణిస్తాయి. ఈ వ్యాధి లక్షణాలను ఉదయం, మధ్యాహ్న వేళల్లో గొర్రెల్లో కనిపిస్తాయి. గొర్రెలకు ఈ వ్యాధి రాకుండా టీకాలు వేయించాలి. వ్యాధి సోకిన గొర్రెలను మంద నుంచి వేరుచేయాలి.
జాగ్రత్తలు అవసరం
వర్షాకాలంలో పశువులకు వచ్చే వ్యాధులపై రైతులు జాగ్రత్తలు తీసుకోవాలి. సీజనల్ వ్యాధులు సోకే ప్రమాదం ఉన్నందున ముందుగానే టీకాలు వేయించుకోవడం ఉత్తమం. వ్యాధుల పట్ల నిర్లక్ష్యం చేస్తే పశుప్రాణాలకు ముప్పు. పశువులకు సోకే వ్యాధులను గుర్తిస్తే దగ్గరలో ఉన్న పశువుల ఆస్పత్రిలో వైద్యులను సంప్రదించాలి. సకాలంలో వైద్యం అందేలా కృషి చేయాలి.
– డాక్టర్. మల్లంపల్లి సాయిబుచ్చారావు, సహాయ సంచాలకులు ప్రాంతీయ పశుసంవర్థకశాఖ, జీలుగుమిల్లి
వర్షాకాలంలో పశువులకు సీజనల్ వ్యాధులు సోకే ప్రమాదం
ముందుగానే టీకాలు వేయించాలంటున్న పశువైద్యులు

పశువుల ప్రాణాలకే ముప్పు

పశువుల ప్రాణాలకే ముప్పు

పశువుల ప్రాణాలకే ముప్పు