
పారిజాతగిరిలో కల్యాణోత్సవం
జంగారెడ్డిగూడెం: స్థానిక గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీవేంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఆదివారం శ్రవణా నక్షత్ర సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసునికి కల్యాణోత్సవం ప్రధాన అర్చకులు నల్లూరు రవికుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు. కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం, జంగారెడ్డిగూడెం, భీమడోలు, భీమవరం నుంచి వచ్చిన పలువురు దంపతులు కల్యాణ తంతులో ఉభయదారులుగా వ్యవహరించారు. జంగారెడ్డిగూడెంకు చెందిన హరే శ్రీనివాస భజన మండలచే కోలాట ప్రదర్శన నిర్వహించారు. ఏర్పాట్లను కార్యనిర్వాహణాధికారి కలగర శ్రీనివాస్ పర్యవేక్షించారు. ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ పేరిచర్ల జగపతి రాజు, సభ్యులు పాల్గొన్నారు.
అత్యాచారయత్నంపై కేసు నమోదు
ఉండి: వ్యక్తిపై అత్యాచారయత్నం కేసు నమోదైంది. వివరాల ప్రకారం ఉండి గోరింతటలో 19 ఏళ్ల యువతి తన తల్లితో నివాసముంటుంది. పాములపర్రు గ్రామానికి చెందిన వర్రే రాజేష్ హోటల్‌లో వంట చేసేందుకు మనిషి కావాలని అడిగేందుకు ఈ నెల 12న ఉదయం 7 గంటలకు యువతి వద్ద ఆమె తల్లి ఫోన్ నంబర్ తీసుకున్నాడు. ఆదివారం ఆమె తల్లి ఇంట్లో లేని సమయంలో యువతిపై అత్యాచారయత్నానికి పాల్పడగా కేకలు వేయడంతో రాజేష్ పారిపోయాడు. దీనిపై యువతి ఆమె తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎస్సై ఎండీ నసీరుల్లా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.