
జెడ్పీ చైర్‌పర్సన్‌పై దాడి హేయం
నూజివీడు : గుడివాడలో జెడ్పీ చైర్‌పర్సన్ ఉప్పాల హారికపై దాడి సంఘటనను తీవ్రంగా ఖండిస్తున్నట్లు నూజివీడు మాజీ ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు ఆదివారం పేర్కొన్నారు. జిల్లా పరిషత్ చైర్ పర్సన్‌గా ఉన్న బీసీ మహిళా ప్రజా ప్రతినిధి పట్ల టీడీపీ ప్రవర్తన దారుణమన్నారు. ప్రపంచమంతా అభివృద్ధిలో వేగంగా ముందుకు వెళుతుంటే ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం పరిస్థితులు అత్యంత దారుణంగా ఉన్నాయన్నారు. రాష్ట్రంలో పరిస్థితులు చూస్తుంటే ఎక్కడ ఉన్నామో ఎటువైపు పయనిస్తున్నామో అర్థం కావటం లేదన్నారు. ఇలాంటి అరాచకాన్ని అరికట్టాలని, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ పైనే దాడులు చేస్తే, సామాన్య మహిళల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు.
మహిళా జెడ్పీ చైర్‌పర్సన్‌పై దాడి హేయం
భీమడోలు: కృష్ణా జిల్లా జెడ్పీ చైర్‌పర్సన్ ఉప్పాల హరిక, ఆమె భర్త రాములపై టీడీపీ గుండాలు దాడి చేయడం అత్యంత హేయమైన చర్య అని రాష్ట్ర బీసీ సెల్ వర్కింగ్ అధ్యక్షుడు నౌడు వెంకట రమణ అన్నారు. బీసీ మహిళ నేతపై టీడీపీ గుండాల దాడి ప్రజాస్వామ్యంలో చీకటి రోజు అన్నారు. రక్షణ కల్పించాల్సిన పోలీసులు పచ్చ చొక్కాలకు కాపలాదారులుగా మారడం అత్యంత దురదృష్టకరమన్నారు. మహిళలపై దాడి చేసే హీన సంస్కృతిని చంద్రబాబు ప్రోత్సహించడం దురదృష్టకరమని, భవిష్యత్తు ఎన్నికల్లో ప్రజలే సరైన గుణపాఠం చెబుతారని, జాగ్రత్తగా ఉండాలన్నారు.
అధికారుల అలసత్వం వల్లే జీతాలు ఆలస్యం
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఉపాధ్యాయుల బదిలీలు జరిగి నెలరోజులు కావస్తున్నప్పటికీ సీఎస్‌ఈ అధికారులు కేడర్ బలం నిర్ధారించి పొజిషన్ ఐడీలు కేటాయించడంలో అలసత్వం వహించడం వల్లనే బదిలీ పొందిన ఉపాధ్యాయులు ఇంత వరకూ జూన్ నెల జీతాలు పొందలేక పోయారని ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు తాళ్ళూరి రామారావు, బీ.రెడ్డిదొర ఒక ప్రకటనలో ఆగ్రహం వ్యక్తం చేశారు. సకాలంలో జీతాలు రాక ఉపాధ్యాయులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులకు బోధనేతర పనులు అప్పగించటం వలన, రకరకాల ట్రైనింగ్‌ల వలన బోధన సమయం హరించుకుపోతోందని, ట్రైనింగ్‌లను కేవలం ఒక్క రోజు మాత్రమే ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఆలస్యంగా విద్యార్థినులకు భోజనంపై ఆగ్రహం
నూజివీడు: పట్టణంలోని బీఆర్ అంబేద్కర్ బాలికల గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్‌ల బాధ్యత రాహిత్యం కారణంగా విద్యార్థినులు ఆదివారం ఆకలితో అలమటించారు. మధ్యాహ్నం 12.30 గంటల కల్లా భోజనం పెట్టాల్సి ఉండగా రెండు గంటల వరకు పెట్టలేదు. ప్రిన్సిపాల్ బాధ్యతలను వైస్ ప్రిన్సిపాల్ కు అప్పగించి వెళ్లగా, వైస్ ప్రిన్సిపాల్ మరొక టీచర్ కు బాధ్యతలను అప్పగించారు. 600 మంది విద్యార్థినులు ఉండగా ఆదివారం కావడంతో పిల్లలను కలుసుకునేందుకు వచ్చిన తల్లిదండ్రులను లోపలికి అనుమతించలేదు. రెండు గంటలవుతున్నా భోజనం పెట్టకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందారు. తల్లిదండ్రులు గొడవ చేయడంతో చివరికి రెండు గంటల తరువాత భోజనం పెట్టారు. కొందరు తల్లిదండ్రులు తహసీల్దార్‌కు సమాచారం అందించడంతో ఆయన వీఆర్వోలను గురుకుల పాఠశాల వద్దకు పంపించారు.
కిడ్నీ అమ్మకానికి వచ్చిన వ్యక్తిని అడ్డుకున్న పోలీసులు
తాటిచెట్లపాలెం (విశాఖ): ఆర్థిక సమస్యల కారణంగా కిడ్నీని అమ్ముకోవడానికి ఏలూరు నుంచి నగరానికి వచ్చిన ఒక వ్యక్తి ప్రయత్నాన్ని ఫోర్త్ టౌన్ పోలీసులు అడ్డుకుని, విచారణ జరిపారు. గత నెల 30న అక్కయ్యపాలెం హైవే సమీపంలో ఉన్న ఒక హోటల్‌లో ఇద్దరు వ్యక్తులు కిడ్నీ అమ్మకం గురించి మాట్లాడుకుంటున్నారని హోటల్ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు స్పందించి, ఆ ఇద్దరినీ స్టేషన్‌కు తరలించి విచారించారు. వారిద్దరూ ఏలూరుకు చెందిన రంగబాబు, యేసురాజుగా గుర్తించారు. ఆర్థిక ఇబ్బందుల వల్ల కిడ్నీని అమ్ముకోవాలని రంగబాబు తన స్నేహితుడైన యేసురాజుకు చెప్పినట్లు విచారణలో వెల్లడైంది. పోలీసులు మరింత లోతుగా విచారించగా, వీరు కిడ్నీ అమ్మకం కోసం ఎవరినీ సంప్రదించలేదని, ఎలాంటి దళారులను కలుసుకోలేదని తేలింది. ఈ విషయంలో ఎలాంటి అనుమానాలు లేవని నిర్ధారించుకున్న పోలీసులు వారిని సొంత ఊరికి పంపించారు. ఈ విషయమై విచారణ ఇంకా కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.