
డ్రోన్ల మంజూరుకు ని‘బంధనాలు’
ఏలూరు(మెట్రో): అన్నదాతలను అన్నింటా ఆదుకుంటామని గొప్పలు చెప్పి గద్దెనెక్కిన కూటమి సర్కారు అన్ని విషయాల్లోనూ మొండిచేయి చూపుతోంది. రైతులకు సాంకేతిక సాయం అందించే డ్రోన్ల పంపిణీలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. వ్యవసాయ రంగంలో డ్రోన్లు సమకూరుస్తామని చెబుతున్నా వాస్తవానికి కార్యరూపం దాల్చడం లేదు. వ్యవసాయ పనులకు ఉపయోగించే డ్రోన్ల మంజూరులో సవాలక్ష నిబంధనలు విధించడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. రైతులు గ్రూపులుగా ఏర్పడాలని, ముందుగా రైతులు బృందంగా బ్యాంకులో రూ.5 లక్షలు డిపాజిట్ చేయాలనే నిబంధనలు విధించింది. అంతే కాకుండా బ్యాంకులు మిగిలిన సొమ్మును రుణంగా ఇస్తాయని, అనంతరం సదరు రైతు సంఘానికి డ్రోన్‌ను అందించే ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. డ్రోన్ ఉపయోగంలోకి వచ్చిన తర్వాత రాయితీ సొమ్ములు రైతు సంఘం ఖాతాకు జమ చేస్తామని అంటోంది. ముందే సొమ్ములు ఉంటే రైతులే కొనుగోలు చేసుకుంటారనే కనీస పరిజ్ఞానం కూడా లేకుండా డ్రోన్లు అందించడంలో నిబంధనల సాకు చూపి నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. వాస్తవానికి సాగులో రైతులకు కూలీల కొరత ఇబ్బంది పెడుతోంది. పంటలకు మందులు, ఎరువుల పిచికారీకి డ్రోన్లు ఉపయోగపడతాయి. డ్రోన్లను సమకూర్చడం ద్వారా కూలీల కొరతను అధిగమించవచ్చని రైతులు అంటున్నారు. అలాగే సమయం, డబ్బు ఆదా అవుతుందని చెబుతున్నారు.
16 మాత్రమే పలు దశల్లో..
జిల్లావ్యాప్తంగా 40 డ్రోన్లు కేటాయించగా.. 40 రైతు బృందాలను ఏర్పాటు చేసినట్టు అధికారులు చెబుతున్నారు. వీరిలో 31 సంఘాలు గ్రూపు ఖాతాలు ప్రారంభిస్తే 18 గ్రూపులకు మాత్రమే బ్యాంకు రుణాలు మంజూరయ్యాయి. 16 గ్రూపులు డ్రోన్ల కొనుగోలు, ఇతర దశల్లో ఉన్నాయి. కనీసం సగం గ్రూపులకు కూడా ఇప్పటికీ బ్యాంకులు మంజూరు పత్రాలను అందించలేదు.
నిబంధనలు సడలించాలి
ఆధునిక పరిజ్ఞానం అన్ని రంగాల్లో ముందుకు వెళుతుంటే ప్రభుత్వ నిర్లక్ష్యంతో వ్యవసాయంలో మాత్రం ముందుకు సాగడం లేదు. ప్రతి గ్రామానికీ డ్రోన్ సౌకర్యాన్ని కల్పిస్తే కూలీల కొరతను రైతులు అధిగమించవచ్చు. డ్రోన్ల పంపిణీలో నిబంధనలు సడలిస్తే రైతులకు ఎంతో మేలు జరుగుతుంది.
– పంజగల నరసింహారావు, రైతు కొండలరావుపాలెం
రైతులకు అందని సాంకేతిక సాయం
జిల్లాలో సగం కూడా పంపిణీ కాని డ్రోన్లు
ఆంక్షలపై రైతుల పెదవివిరుపు

డ్రోన్ల మంజూరుకు ని‘బంధనాలు’