
పునరావాస కార్యక్రమాల పరిశీలన
వేలేరుపాడు: కుక్కునూరు, వేలేరుపాడు మండలాలకు చెందిన వరద బాధిత కుటుంబాలకు దాచారంలోని ఆర్ అండ్ ఆర్ కాలనీలోను, తాడువాయి, ములగలంపల్లిలలో ఏర్పాటుచేసిన వరద పునరావాస శిబిరాలలో సహాయ, పునరావాస కార్యక్రమాలను అధికారులు దగ్గరుండి పరిశీలించారు. ఆదివారం ఉదయం రేపాకగొమ్ము గ్రామంలోని కొన్ని కుటుంబాలను తాడువాయి, ములగలంపల్లిలో ఏర్పాటుచేసిన పునరావాస శిబిరాలకు తరలించే పనులను ఆర్డీఓ పర్యవేక్షించారు. దాచారం ఆర్ అండ్ ఆర్ కాలనీలోని ఏర్పాటుచేసిన శిబిరాలలో ప్రజలకు భోజన తయారీని జంగారెడ్డిగూడెం ఆర్డీఓ ఎం.వి. రమణ దగ్గరుండి పరిశీలించి, ప్రజలకు వడ్డించారు. వర్షాలు, వరదలకు ఇళ్ళు దెబ్బతిన్న కుటుంబాలకు టార్పాలిన్లు అందిస్తున్నారు. సహాయ పునరావాస కార్యక్రమాలలో పొరపాట్లు జరగకుండా ఆర్డీఓ పర్యవేక్షిస్తున్నారు. చల్లావారిగూడెంలో ఏర్పాటు చేసిన వరద పునరావాస కేంద్రం వద్ద తాగునీటికి కొరతా లేకుండా మూడు బోర్లను ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు ఏర్పాటు చేశారు. కుక్కునూరు, వేలేరుపాడు తహసిల్దార్‌లు రమేష్ కుమార్, జి.సత్యనారాయణ, రెవిన్యూ, పౌర సరఫరాల శాఖ సిబ్బంది పునరావాస కార్యక్రమాలలో పాల్గొన్నారు.