
ఆషాఢంలోనూ తగ్గని భక్తుల రద్దీ
ద్వారకాతిరుమల: ఆషాఢ మాసం అయినప్పటికీ శ్రీవారి క్షేత్రంలో భక్తుల రద్దీ తగ్గలేదు. స్వామివారికి ప్రీతికరమైన రోజు కావడంతో శనివారం వేలాది మంది భక్తులు ఆలయానికి తరలివచ్చారు. దాంతో క్షేత్ర పరిసరాలు సందడిగా మారాయి. ఆలయ అనివేటి మండపం, వైకుంఠం క్యూ కాంప్లెక్స్, దర్శనం క్యూలైన్లు, ఆలయ తూర్పు రాజగోపుర ప్రాంతం, షాపింగ్ కాంప్లెక్స్, కల్యాణకట్ట తదితర విభాగాలు భక్తులతో పోటెత్తాయి. సాయంత్రం వరకు క్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగింది.
పురుగుల మందు తాగి ఆత్మహత్య
కై కలూరు: జీవితంపై విరక్తి చెందిన వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలిదిండి మండలం మూలలంకలో శనివారం జరిగింది. కలిదిండి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన మామిడిశెట్టి రాము(45) భార్య రెండేళ్ళ క్రితం బతుకుదెరువు నిమిత్తం కువైట్ వెళ్ళింది. వీరికి పాప, బాబు సంతానం. పాప వసతిగృహంలో చదువుతోంది. బాబు తండ్రి వద్దే ఉంటున్నాడు. రాము చేపల చెరువులపై పనులు చేస్తాడు. కొంత కాలంగా మద్యానికి బానిసయ్యాడు. ఈ నేపథ్యంలో ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని భావిస్తున్నారు. తల్లి కృష్ణవేణి ఫిర్యాదుపై ఎస్సై వి.వేంకటేశ్వరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మేకలను కబళిస్తున్న వింత వ్యాధి
ఆగిరిపల్లి: మండలంలోని వడ్లమాను గ్రామంలో గత మూడు రోజుల నుంచి వింత వ్యాధితో మరణించడంతో గ్రామస్తులు బెంబేలెత్తిపోతున్నారు. గ్రామానికి చెందిన సాదం స్వామికి 50 మేకలుండగా.. గురువారం ఒక మేక నురగ కక్కుతూ మృతి చెందింది. ఆ వ్యక్తి మందులు వేసినా శుక్రవారం మరో నాలుగు మేకలు మరణించాయి. శనివారం నాలుగు మేకలు పొట్ట ఉబ్బి నురగ కక్కుతూ చనిపోయాయి. ఎంపీటీసీ రాణి మేకల సత్యనారాయణ ఆగిరిపల్లి పశువైద్యాధికారి హనుమంతరావుకు సమాచారం అందించారు. ఆయన తన సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకొని మేకలను పరీక్షించి వైద్యం అందజేశారు. ఇదే విషయమై పశు వైద్యాధికారి హనుమంతరావుని సంప్రదించగా శ్రీకాప్రియన్ క్లోరో న్యుమోనియ్ఙోఅనే బ్యాక్టీరియా వల్ల మేకలు మరణించవచ్చని తెలిపారు. శాంపిల్స్ ఏలూరు ల్యాబ్‌కు పంపించామని తెలిపారు. వైద్యం అందించిన ఇంకా పది మేకల పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. తనను ప్రభుత్వం ఆదుకోవాలని బాధితుడు స్వామి ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాడు.

ఆషాఢంలోనూ తగ్గని భక్తుల రద్దీ