
తహసీల్దార్ కార్యాలయంలో వసూళ్ల పర్వం
వివాదాలకు కేంద్రంగా ఉన్న కాంట్రాక్టు ఉద్యోగి
కొయ్యలగూడెం: కొయ్యలగూడెం తహసీల్దార్ కార్యాలయంలో భారీ ఎత్తున అవినీతి జరుగుతుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కుల ధ్రువీకరణ పత్రం మొదలుకొని పాస్ బుక్‌లు చేయడానికి రూ.వేలు వసూలు చేస్తున్నారని అంటున్నారు. కాంట్రాక్టు ఉద్యోగం చేస్తున్న వ్యక్తి ఈ అవినీతి ఆరోపణలకు కేంద్ర బిందువుగా ఉన్నాడు. తాజాగా కొయ్యలగూడెం మండలం పరింపూడి రెవెన్యూ భూమికి సంబంధించి సుమారు తొమ్మిది ఎకరాల భూమి మ్యుటేషన్, సబ్ డివిజన్ చేసేందుకు సదరు కాంట్రాక్టు ఉద్యోగి వ్యవహారం నడిపాడు. ఇందుకు రూ.2 లక్షలు ఒప్పందం కుదుర్చుకొని ఒక రైతు నుంచి రూ.1.50 లక్షలు తీసుకున్నాడు. తదుపరి భూమి విలువ ఎక్కువగా ఉందని అదనంగా మరో రూ.1.50 లక్షలు ఇవ్వాల్సిందిగా కార్యాలయ ఉద్యోగులతో కలిసి రైతుపై ఒత్తిడి తీసుకురావడంతో పాటు బెదిరింపులకు పాల్పడ్డాడు. గతంలో ఒక గ్రామానికి చెందిన దళిత రైతులకు సంబంధించి ఆన్‌లైన్‌లో తప్పుడు పేర్లు, తప్పుడు ఖాతా నెంబర్లు, రికార్డులు సృష్టించి అవినీతికి పాల్పడి విచారణను ఎదుర్కొన్నాడు. ఇటీవల కొయ్యలగూడెంలోని నడిబొడ్డున జాతీయ ప్రధాన రహదారికి ఆనుకుని ఉన్న స్థలానికి సంబంధించి కాంట్రాక్టు ఉద్యోగి కీలకంగా వ్యవహరించినట్లు ఇంటెలిజెన్స్, విజిలెన్స్ అధికారులు సైతం ధ్రువీకరించారు. జిల్లా వ్యాప్తంగా అటు రాజకీయ ప్రకంపనలు సృష్టించడంతోపాటు ఇటు రెవెన్యూ యంత్రాంగాన్నే కుదిపేసిన సుమారు రూ.40 కోట్ల విలువైన భూమికి సంబంధించిన వ్యవహారంలో నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి భారీ స్థాయిలో దండుకున్నట్లు తెలిసింది. కాంట్రాక్ట్ ఉద్యోగి తీరుపై ఉన్నతాధికారులు విచారణ చేయించి నివేదికలు తెప్పించుకున్నారు. కార్యాలయ ఉద్యోగులకు ప్రజల నుంచి వసూళ్లు రాబట్టడంలో మధ్యవర్తిగా వ్యవహరిస్తూ రూ.లక్షలు చేతులు మారడానికి దళారీగా వ్యవహరిస్తున్నాడు. వివాదాస్పద స్థలాలు కొనుగోలు చేసి డాక్యుమెంట్లు సృష్టించి వాటిని సొమ్ము చేసుకుంటూ రూ.కోట్లు అర్జించినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇతని వ్యవహారంపై రెవెన్యూ శాఖ మొత్తం గుర్రుగా ఉన్న అతనితో చేయించుకున్న అక్రమాలు ఎక్కడ బయటపడతాయేమోనని మౌనంగా ఉంటున్నారు.