
ఆషాఢం
సంప్రదాయ సమ్మేళనం
● జిల్లాలో ఆధ్యాత్మిక శోభ ● అమ్మవార్లకు సారెలు, విశేష అలంకరణలు ● ఇళ్లలో తెలగ పిండి, మునగాకు వంటకాలు ● ఆడపడుచుల చేతికి గోరింటాకు లేపనాలు ● చక్కర్లు కొడుతున్న కొత్త జంటలు ● దుకాణాల్లో ఆఫర్ల మేళాలు
సాక్షి, భీమవరం: సంస్కృతి, సంప్రదాయాల పుట్టిల్లు తెలుగు నేల. ప్రకృతితో మమేకం చేస్తూ ఇక్కడి ప్రతి నెలకి ఏదోక విశిష్టత ఉంటుంది. అందులోనూ నాలుగో నైలెన ఆషాఢ మాసం మరింత ప్రత్యేకమైనదిగా భావిస్తారు. వాతావరణాన్ని చల్లబరుస్తూ తొలకరి వర్షాలు, పొంగి ప్రవహించే కాలువలు, వరి నాట్లుతో పచ్చ తివాచీని పరుచుకునే పంట పొలాలు, గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు, ప్రత్యేక వంటకాలు, ఆచారాలు ఆహ్లాదాన్ని అందిస్తాయి. పౌర్ణమి నాడు చంద్రుడు ఉత్తరాషాఢ, పూర్వాషాఢ నక్షత్రాల్లో సంచరించడం వలన ఈ నెలను ఆషాఢ మాసంగా పిలుస్తారు. మిగిలిన నెలలతో పోలిస్తే శూన్య మాసంగా భావించి శుభకార్యాలు తలపెట్టనప్పటికి దేవతారాధనకు ఇదే సరైన సమయంగా పెద్దలు చెబుతారు. ఆషాఢంలోని తొలి ఏకాదశి రోజునే శ్రీమన్నారాయణుడు యోగ నిద్రలోకి వెళ్లేది. హిందువుల తొల పండుగ కూడా ఇదే.
గురు పౌర్ణమి, స్కంధ షష్ఠి తదితర పర్వదినాలు జరుపుకుంటారు. జిల్లాలోని గ్రామ దేవతలకు ఆషాఢం సారెలు, మొక్కుబడులు సమర్పించుకోవడం అనాదిగా వస్తోంది. భీమవరం మావూళ్లమ్మ, రాయకుదురు మావూళ్లమ్మ, మహాలక్షి, ఏలూరుపాడులోని ముసలమ్మ, ఎల్లమ్మ, మోగల్లులోని పెన్నేరమ్మ, మారమ్మ, గంగాదేవి అమ్మవార్లు, జిల్లాలో పేరొందిన గ్రామ దేవతల ఆలయాల్లో ఆషాఢ మాసం పూజలు ఘనంగా జరుగుతున్నాయి. శాఖాంభరిగా, ప్రత్యేక అలంకరణల్లో అమ్మవార్లు భక్తులకు దర్శనిమిస్తున్నారు.
నవ దంపతుల చక్కర్లు
కొత్తగా పెళ్లైన జంట ఆషాఢంలో అత్తవారింటి గడప దాటకూడదని సంప్రదాయం. ఈనెల్లో దంపతులు కలిస్తే తొమ్మిది నెలల తర్వాత మండు వేసవిలో కాన్పు వచ్చే అవకాశం ఉంది. వైద్య సదుపాయాలు అంతగా లేని ఆ రోజుల్లో ఇది తల్లీబిడ్డకు మంచిది కాదు. తొలకరి జల్లులతో సార్వా పనులు మొదలయ్యేది ఇప్పుడే. కొత్త పెళ్లికొడుకు పొలం పనులకు పోకుండా భార్య కొంగు పట్టుకుని తిరిగితే తిండి గింజలకు ఇబ్బంది పడాల్సి వస్తుందన్నది ఒక కారణం. అనుభవ జ్ఞానంతోనే పూర్వీ కులు ఆషాఢం వేళ కొత్తజంట అత్తింటి గడప దాటకూడదనే ఆచారం తెచ్చారంటారు. అయినా ఇంటిలోని వారికి ఏవో సాకులు చెప్పి నవ దంపతులు చక్కర్లు కొట్టడం, ఏమీ తెలీనట్టుగా అత్తమామలు లోలోపల మురిసిపోవడం ప్రతి ఇంటా జరిగే తంతే. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలోని పట్టణాల్లో పార్కులు, పేరుపాలెం బీచ్, ఇతర పర్యాటక కేంద్రాలు కొత్త జంటలతో కళకళతాడుతున్నాయి.
గోరింట పూస్తుంది
ఆరేళ్ల పాపాయి నుంచి 60 ఏళ్ల వృద్ధురాలి వరకు అరచేతులు, కాళ్లకు పారాణిగా గోరింటాకు పెట్టుకునేందుకు ఉత్సాహపడతారు. పల్లెల్లోని అమ్మ మ్మలు, నానమ్మలు గోరింటాకును రుబ్బించి పట్టణాల్లోని తమ కుమార్తెలు, కోడళ్లు, మనవరాళ్లకు పంపిస్తుంటారు. ఈ సీజన్‌లో గోరింటాకు పెట్టుకోవడం వెనుక శాసీ్త్రయ కారణంగా ఉంది. వర్షాల వలన ఇంట్లో పనులు చేసుకునే మహిళల కాళ్లు, చేతులు పగుళ్లు తీస్తుంటాయి. గోరింటాకు పగుళ్లు రాకుండా చేస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబు తున్నారు. ఇలా ఆషాఢ ఆచారాలు ఆధ్యాత్మికతతో పాటు ఆరోగ్య కారకాలుగా ఉన్నాయి.
అన్నింటా ఆఫర్ల మేళా
ఆషాఢం వేళ అన్నింటా ఆఫర్ల మేళానే. జిల్లాలో ఏలూరు, భీమవరం, పాలకొల్లు, తాడేపల్లిగూడెం, తణుకు, జంగారెడ్డిగూడెం, నరసాపురం, నూజివీడు తదితర పట్టణాల్లోని క్లాత్, రెడీమేడ్, జ్యూయలరీ, కాస్మోటిక్స్ షోరూంలతో పాటు మండల కేంద్రాల్లోని చిన్న దుకాణాల్లో సైతం ప్రస్తుతం ఆషాఢం ఆఫర్లు నడుస్తున్నాయి. మహిళల్ని ఆకర్షించి అమ్మకాలు ఆషాఢం సేల్ అంటూ వ్యాపారులు ఆఫర్లు ప్రకటిస్తున్నారు.
వంటకాలూ ప్రత్యేకమే
వర్షాలతో శరీరం చల్ల బడి నజ్జు చేయడం, ప్రతికూల వాతావరణంతో ఇన్ఫెక్షన్లు సోకే ప్రమాదం ఉంది. వీటికి నివారణగా తెలగపిండి–మునగాకు, పప్పు–వాగ కాయలు ఈ ఆషాఢ మాసంలో వండుకోవడం జిల్లా అంతటా కనిపిస్తుంది. గ్రామల్లో నివసించే వారు పట్ట ణాల్లోని తమ వాళ్లకు ప్రత్యేకంగా వండి పంపిస్తుంటారు. వీటిలోని పోష కాలు శరీర ఉష్ణోగ్రతలను అదుపులో ఉంచి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఆషాఢంలో ఒక్కసారైన ఈ కూరలు తినాలనేది ఆనాదిగా వస్తున్న ఆచారం. ఈ సీజన్‌లో వచ్చే నేరేడుపండ్లు, తాటికాయాలు ఆరోగ్యానికి ఎంతో మేలుచేస్తాయి.
అరుదైన కాలం ఆషాఢం
ఆషాఢ మాసం అన్ని నెలల్లోనూ అరుదైనది. సూర్యుడు మిధున రాశి నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ సమయంలో వాతావరణంలో పెనుమార్పులు సంభవిస్తాయి. వీటిని తట్టుకునేలా మనుషులు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలతో వచ్చే మార్పుల ప్రభావం వ్యాధి నివారణకు ఉపకరిస్తుంది. పండితులు చాతుర్మాస దీక్షలు చేపడతారు. ఆధ్యాత్మికతతో పాటు ఆరోగ్యం పెనవేసుకున్నా మాసం ఆషాఢం. – రామశాస్త్రి, పండితులు, ఆకివీడు

ఆషాఢం

ఆషాఢం

ఆషాఢం

ఆషాఢం